కేసీఆర్‌ సంజాయిషీ చెప్పాలి: కిషన్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 26/11/2020 16:32 IST

కేసీఆర్‌ సంజాయిషీ చెప్పాలి: కిషన్‌రెడ్డి

ఎన్నికల్లో లబ్ధికే ఇతరులపై సీఎం నిందలు

పోలింగ్‌శాతం తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారన్న కేంద్రమంత్రి

హైదరాబాద్‌: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ ప్రజలను భయపెట్టేలా ఆరోపణలు చేస్తున్నారని.. గ్రేటర్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇతరులపై నిందలు మోపుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఎన్నిక సమయంలో మంత్రి కేటీఆర్‌ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని.. ఇప్పుడు కేసీఆర్‌ అలా అంటున్నారని విమర్శించారు. ఇతర పార్టీలపై బురద చల్లడం, ప్రజల్లో ఒకరిపై మరొకరికి అపనమ్మకం కలిగించేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో సీఎం ఆలోచించాలన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఇదేమీ నిజాం రాజ్యం కాదని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కుటుంబానికి శాశ్వతమైన అధికారం కట్టబట్టలేదన్నారు. 

ఆ వ్యాఖ్యలు మజ్లిస్‌ అహంకారానికి అద్దం పడుతున్నాయి

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌శాతం తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని.. అధికార యంత్రాంగాన్ని సీఎం ఉసిగొల్పుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. పార్టీలు వస్తూపోతుంటాయని, వ్యవస్థ శాశ్వతమని చెప్పారు. పీవీ, ఎన్టీఆర్‌ సమాధులు కూల్చాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు ఎంఐఎం అహంకారానికి అద్దం పడుతున్నాయన్నారు. మజ్లిస్‌ నేతలు ఈ విధంగా మాట్లాడేందుకు ఎవరు కారణమో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎంఐఎంతో కలిసి స్నేహం చేస్తున్నందున ప్రజలకు సీఎం కేసీఆర్‌ సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భాజపాపై తండ్రీకొడుకులిద్దరూ వాస్తవ విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని.. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు సంయమనంతో ఉండాల్సిన అవసరముందని కేసీఆర్‌, కేటీఆర్‌ను ఉద్దేశించి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎల్‌ఐసీపై ఇంతవరకూ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ మతకల్లోలాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కేంద్రంలో ఆరేళ్లుగా పాలిస్తున్నామని.. ఎక్కడా మతకలహాలు, కర్ఫ్యూలు లేవని చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రంలోనూ భాజపా అధికారంలోకి వచ్చాక శాంతి ఏర్పడిందన్నారు. ఎవరు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదని.. నగర ప్రజలకు భాజపా అండగా ఉంటుందన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని