బెంగాల్‌లో ఫిరాయింపుల జోరు!

తాజా వార్తలు

Updated : 23/12/2020 15:03 IST

బెంగాల్‌లో ఫిరాయింపుల జోరు!

పోటాపోటీగా ప్రత్యర్థి పార్టీల నాయకులకు గాలం

కోల్‌కతా: సిద్ధాంతాలే ప్రాతిపదికగా రాజకీయాలను నడిపించిన నేల అది... పార్టీ ఫిరాయింపులను అనైతిక చర్యగా ఛీత్కరించిన రాష్ట్రమది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది! ఆయారాం గయారాం సృంస్కృతికి పశ్చిమ బెంగాల్‌ ఓ కేంద్రంగా మారింది. మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్న వేళ ప్రజాప్రతినిధుల ఫిరాయింపులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ తప్పిదం ఎవరిదనే విషయంలో అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2011కు ముందు, తర్వాత పరిస్థితులపై రాజకీయంగా తీవ్ర చర్చే జరుగుతోంది. అధికార పగ్గాలు టీఎంసీ చేతికి వచ్చాక కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు మమతా బెనర్జీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తున్నామనే పేరుతో సొంత గూళ్లను వీడారు. గత పదేళ్లలో 40 మంది వరకూ విపక్ష ఎమ్మెల్యేలను టీఎంసీ తన వైపునకు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు అదే ఫిరాయింపుల బెడదను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎదుర్కొంటోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో భాజపా 18 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన తర్వాత టీఎంసీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి కమలం పార్టీలో చేరారు. గత శనివారం మేదినీపుర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి సువేందు అధికారి సహా అయిదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, 34 మంది ఇతర నాయకులు ఒకేసారి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఒక్కసారిగా ఇంతపెద్ద సంఖ్యలో నేతలు టీఎంసీని వీడిపోవటం ఇదే ప్రథమమని అంటున్నారు. కమలనాథుల చర్యకు ప్రతీకారం తీర్చుకునేలా తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా వెంటనే స్పందించింది. భాజపా ఎంపీ, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్‌ భార్య సుజాతా మండల్‌ ఖాన్‌ను పార్టీలో చేర్చుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ నాయకుల, కార్యకర్తల ఫిరాయింపులు ఇంకా అధికం కానున్నాయని తెలుస్తోంది.

కేబినెట్‌ భేటీకి నలుగురు గైర్హాజరు
పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి నలుగురు మంత్రులు గైర్హాజరు కావటం చర్చనీయాంశమయ్యింది. అటవీ మంత్రి రజిబ్‌ బెనర్జీ పార్టీ మారుతున్నారనే పుకార్లు ఊపందుకున్నాయి.

200 స్థానాలు రాకపోతే వైదొలగుతారా?

భాజపా నేతలకు ప్రశాంత్‌ సవాల్‌
దిల్లీ: వచ్చే ఏడాది జరిగే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సాధించే సీట్లు రెండు అంకెలకు మించవని జోస్యం చెప్పిన మరునాడే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆ పార్టీ నేతలకు మరో సవాల్‌ విసిరారు. ఎన్నికల్లో 200 స్థానాలు గెలుస్తామని చెబుతున్న కమలదళ నాయకులు.. అలా జరగకపోతే పార్టీ పదవుల నుంచి వైదొలగుతారా అని ప్రశ్నించారు. భాజపా రెండంకెలు దాటి సీట్లు గెలిస్తే ట్విటర్‌ నుంచి తప్పుకుంటానని ప్రశాంత్‌ కిశోర్‌ సోమవారం ప్రకటించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం దేశం ఓ ఎన్నికల వ్యూహకర్తను కోల్పోనుందన్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ వ్యాఖ్యలపై కిశోర్‌ ఈ సవాలు చేశారు.

అభివృద్ధిలో బెంగాలే మిన్న: మమత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అభివృద్ధి జరగలేదంటూ కేంద్ర హోంమంత్రి, భాజపా నేత అమిత్‌ షా చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తోసిపుచ్చారు. అభివృద్ధి సూచీలన్నిటిలోనూ దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా పశ్చిమ బెంగాల్‌ మంచి పని తీరు కనబరుస్తోందని మంగళవారం నాడు ఆమె పేర్కొన్నారు. వివిధ అంశాల వారీగా ఆ గణాంకాలను ఉదహరించారు. జాతీయ నేర నమోదు విభాగం (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం గత పదేళ్లలో రాజకీయ హింస బెంగాల్లో తగ్గిందన్నారు.

ఇవీ చదవండి..
మడమతిప్పని ఉద్యమ పోరు

2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలు..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని