Akhilesh: ఆ టీకా వద్దన్నా.. ప్రభుత్వానిది కాదు

తాజా వార్తలు

Updated : 08/06/2021 12:29 IST

Akhilesh: ఆ టీకా వద్దన్నా.. ప్రభుత్వానిది కాదు

లఖ్‌నవూ: కరోనా వ్యాక్సిన్‌ను ‘భాజపా టీకా’గా పేర్కొన్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తాజాగా తాను వ్యాక్సిన్‌ తీసుకుంటానని ప్రకటించారు. తాము భాజపా టీకాలకు మాత్రమే వ్యతిరేకమని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే టీకాలను వేసుకుంటామని అన్నారు. వ్యాక్సిన్‌ విధానంలో మార్పులపై ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై స్పందిస్తూ అఖిలేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం టీకా పంపిణీ విధానంపై రాజకీయాలు చేయడం మాని వ్యాక్సినేషన్‌పై పూర్తి నియంత్రణ తీసుకుంది. మేం భాజపా వ్యాక్సిన్‌కు వ్యతిరేకం. కానీ ‘భారత ప్రభుత్వానికి’ చెందిన టీకాలను స్వాగతిస్తున్నాం. మేం కూడా వ్యాక్సిన్‌ వేయించుకుంటాం. డోసుల కొరత కారణంగా ఇంతవరకూ టీకాలు వేయించుకోలేని వారు కూడా వ్యాక్సిన్‌ తీసుకోండి’’ అఖిలేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

కరోనా వ్యాక్సిన్‌ ‘భాజపా టీకా’ అని, దాన్ని తాను వేయించుకోనని ఈ ఏడాది జనవరిలో అఖిలేశ్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే అఖిలేశ్‌ తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ నిన్న కొవిడ్‌ టీకా వేయించుకోవడంతో భాజపా విమర్శలు గుప్పించింది. అఖిలేశ్ వద్దన్న భాజపా వ్యాక్సినే ఇప్పుడు ములాయంకు అందిందంటూ ఎద్దేవా చేసింది. 

కాగా.. దేశంలో 18ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేయించే బాధ్యత కేంద్రానిదే అని, రాష్ట్రాలపై పైసా భారం పడదని ప్రధాని మోదీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో టీకా విధానంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు, వివిధ రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని