
తాజా వార్తలు
బాగ్‌లింగంపల్లిలో అఖిలపక్ష భేటీ
రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం
హైదరాబాద్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు అఖిలపక్ష నేతలు వెల్లడించారు. వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్, తెదేపా, తెజస, సీపీఎం, సీపీఐ నేతలు హాజరయ్యారు. రైతులకు మద్దతుగా చేయాల్సిన కార్యాచచరణపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు. దిల్లీ పర్యటన అనంతరం సాగు చట్టాలపై సీఎం కేసీఆర్ మాట మార్చారని వివిధ పార్టీల నేతలు ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాలను సత్వరమే రద్దు చేయాలని.. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. అత్యవసరంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు.
స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత చేస్తున్న అతిగొప్ప పోరాటం రైతులదని నేతలు అభిప్రాయపడ్డారు. దాదాపు రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపకపోవడం శోచనీయమన్నారు. సాగు చట్టాల విషయంలో సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని నేతలు సూచించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఫార్మా సిటీకి భూముల కేటాయింపు ఆలోచనను ప్రభుత్వం విరమిచుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని.. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు నేతలు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రైతుల విషయంలో బాధ్యత తీసుకోవాలని.. ధాన్యం కొనుగోలును యథాతథంగా కొనసాగించాలని కోరారు.
ఇవీ చదవండి..
ఏపీ ప్రభుత్వం పిటిషన్: విచారణ బెంచ్ మార్పు
కేటీఆర్ మెచ్చిన ఈ కుర్రాడి టాలెంట్ చూశారా..?