ప్రజల చేతిలో డబ్బు పెట్టడమే పరిష్కారం..!

తాజా వార్తలు

Published : 30/06/2021 01:08 IST

ప్రజల చేతిలో డబ్బు పెట్టడమే పరిష్కారం..!

దిల్లీ: ప్రస్తుత సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ప్రజల చేతిలో డబ్బు ఉండేలా చేయడమే పరిష్కారమని కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం పేర్కొన్నారు. కొవిడ్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సోమవారం కేంద్రం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మంగళవారం చిదంబరం ట్విటర్‌ వేదికగా స్పందించారు. రుణ హామీ ఎప్పటికీ నేరుగా అప్పు ఇచ్చినట్టు కాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అప్పులతో నెట్టుకొస్తున్న వ్యాపార సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు ఏ బ్యాంకూ ముందుకు రాదని వివరించారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన వ్యాపార సంస్థలు మరిన్ని అప్పులు చేయాలనుకోవని తెలిపారు. వారికి రుణం కాని మూలధనం అవసరమన్నారు. ఉత్పత్తులను ఎక్కువ సరఫరా చేస్తే ప్రజలు ఎక్కువ వినియోగిస్తారని అర్థం చేసుకోవద్దని తెలిపారు. డిమాండ్ పెంచితేనే ఎక్కువ సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. పేద, దిగువ మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడం ద్వారా డిమాండ్ పెంచడమే ఈ సంక్షోభానికి సమాధానం అని ఆయన వెల్లడించారు. నిరుద్యోగం, వేతనాల తగ్గుదలకు దారితీసిన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెంచడం అంత సులువైన పని కాదన్నారు. 

కొవిడ్ కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థను గట్టెక్కించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం రూ.1.5 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులకు రుణ సదుపాయం పెంచడంతోపాటు, ఆరోగ్య రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటక ఏజెన్సీలు, గైడ్‌లకు రుణాలు, ఇవ్వడంతోపాటు విదేశీ పర్యాటకులకు వీసా రుసుము మాఫీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని