‘ఆత్మాభిమానమే ఉంటే ఇంకా ఆ పదవిలో కొనసాగరు’

తాజా వార్తలు

Published : 21/10/2020 01:28 IST

‘ఆత్మాభిమానమే ఉంటే ఇంకా ఆ పదవిలో కొనసాగరు’

మహారాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీపై పవార్‌ ఘాటు వ్యాఖ్యలు

దిల్లీ: ఆలయాలు తెరిచే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ మధ్య జరిగిన మాటల యుద్ధం.. ఆపై అమిత్‌ షా వ్యాఖ్యలు.. ఈ పరిణామాలనుద్దేశించి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఘాటుగా స్పందించారు. ఆత్మాభిమానమే ఉంటే ఆ పదవి నుంచి వైదొలగాలంటూ గవర్నర్‌కు పరోక్ష సవాల్‌ విసిరారు. ‘‘ఆత్మాభిమానం ఉన్న ఏ ఒక్కరూ ఆ పదవిలో కొనసాగరు. లేఖలో గవర్నర్‌ ఉపయోగించిన పదజాలంపై కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఆత్మాభిమానం ఉన్నవారు ఆ పదవిలో ఉండాలా.. లేదా.. అని ఆలోచించి నిర్ణయం తీసేసుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు. 

లాక్‌డౌన్‌ నిబంధనల్ని సడలిస్తూ సాధారణ కార్యకలాపాల్ని పునరుద్ధరిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఆలయాల్ని తెరిచేందుకు మాత్రం నిరాకరించింది. పండుగల సీజన్‌ కావడంతో భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్నందున ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తెరవలేమని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. దీనిపై స్పందించిన కోశ్యారీ.. ‘‘బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లను తెరిచారు. కానీ దేవుళ్లను లాక్‌డౌన్‌లో ఉంచారు. ఇలా చేయమని భగవంతుడి నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? లేదా మీరే అకస్మాత్తుగా లౌకికవాదిగా మారారా?’’ అని లేఖలో ప్రశ్నించారు. ఇది వారివురి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. శివసేన సహా ఇతర విపక్ష పార్టీలు గవర్నర్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

గవర్నర్‌ వ్యాఖ్యల్ని పరోక్షంగా తప్పుబట్టిన కేంద్ర మంత్రి అమిత్‌ షా.. ఆయన ఆ పదాల్ని ఎంచుకొని ఉండాల్సింది కాదు అని అభిప్రాయపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని