ఇమడలేక వెళ్లిపోతున్నారు: బెంగాల్‌ భాజపా చీఫ్‌

తాజా వార్తలు

Published : 10/07/2021 01:02 IST

ఇమడలేక వెళ్లిపోతున్నారు: బెంగాల్‌ భాజపా చీఫ్‌

కోల్‌కతా: తమ పార్టీలో చేరిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు ఇక్కడ ఇమడలేక తిరిగి వెళ్లిపోతున్నారని పశ్చిమ బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ అన్నారు. ఎనిమిది విడతల్లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) విజయం సాధించి తిరిగి అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికలకు ముందు పలువురు టీఎంసీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. తీరా ఫలితాల్లో టీఎంసీ విజయదుందుభి మోగించడంతో తిరిగి సొంతపార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీఎంసీలో తిరిగి చేర్చుకోవాలని కోరుతూ మమతా బెనర్జీకి లేఖలు కూడా రాశారు. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ స్పందించారు.

‘‘కొత్తగా భాజపాలో చేరిన నేతలకు పార్టీ నియమనిబంధనలు కష్టంగా అనిపిస్తున్నాయి. వారు ఈ పార్టీలో ఇమడలేకపోతున్నారు. అదే సీనియర్‌ నాయకులకు ఆ ఇబ్బందేమీ లేదు. మా పార్టీ ఇతర పార్టీల వ్యక్తులను చేర్చుకొని అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు వారు ఏం చేయాలనుకుంటున్నారో వారి ఇష్టం’’ అని దిలీప్‌ ఘోష్‌ అన్నారు. అలాగే, భాజపాలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తున్న మాజీ టీఎంసీ నేతలు రజిబ్‌ బెనర్జీ, సబ్యసాచి దత్తాపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన సువేందు అధికారి ఎమ్మెల్యేగా ఎన్నికై భాజపాలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర సీఎం మమతా బెనర్జీపై వివిధ అంశాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా.. మమతా బెనర్జీపై విమర్శలు చేయొద్దంటూ సువేందు అధికారిని మరో నేత రజిబ్‌ బెనర్జీ వారిస్తున్నారు. ప్రజల మద్దతుతో మమతా బెనర్జీ సీఎం అయ్యారని, ఆమెపై విమర్శలు చేయడం మానేసి.. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు మద్దతుగా పోరాటం చేయాలని సూచించారు. సబ్యసాచి కూడా పలుమార్లు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో వీరిద్దరిపై చర్యలు తీసుకునేందుకు భాజపా సిద్ధమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని