Bengal Bypoll: పోటీకి కాంగ్రెస్‌ దూరం?

తాజా వార్తలు

Published : 05/06/2021 01:20 IST

Bengal Bypoll: పోటీకి కాంగ్రెస్‌ దూరం?

కోల్‌కతా: పశ్చిమ్‌ బెంగాల్‌లో జరగబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భవానీపుర్‌ అసెంబ్లీ స్థానంలో పోటీకి కాంగ్రెస్‌ తరఫున అభ్యర్థిని నిలబెట్టడం తనకు ఇష్టంలేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. ఈ మేరకు యూపీఏ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు.

ఇటీవల పశ్చిమ్‌ బెంగాల్‌లో 8 విడతల్లో శాసనసభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 294 స్థానాలకుగాను 292 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 213 చోట్ల విజయదుందుభి మోగించి తిరిగి అధికారం దక్కించుకుంది. భాజపా 77 స్థానాల్లో గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కాగా మరో ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్‌ మాత్రం ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. వామపక్షాలతో కలిసి 90 స్థానాల్లో బరిలో దిగితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించినా ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మాత్రం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నందిగ్రామ్‌లో ఆమెపై భాజపా అభ్యర్థి సువేందు అధికారి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినా రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుతో మమతా బెనర్జీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్టికల్‌ 164(4) ప్రకారం ఎమ్మెల్యే కాకుండా సీఎం పదవి చేపడితే, ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాల్సివుంటుంది. 

ఈ నేపథ్యంలో దీదీ భవానీపుర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీ అధినేత్రి అభీష్టం మేరకు స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో భవానీపుర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. సీఎంగా దీదీ కొనసాగాలంటే ఈ ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మమతకు విజయం చేకూర్చడం కోసం బరిలోకి రాష్ట్ర కాంగ్రెస్‌ దిగకపోవడం మంచిదని అధిర్‌ రంజన్‌ చౌదరి భావించారు. సీఎం కోసం ఈ మంచి పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయాన్నే కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ ద్వారా వెల్లడించారు. ఈ పోటీలో కాంగ్రెస్‌ పాల్గొనకూడదనేది కేవలం తన అభిప్రాయమని అధిర్‌ రంజన్‌ స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని