
తాజా వార్తలు
దీదీకి మరో మంత్రి షాక్
కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడగా.. తాజాగా మరో మంత్రి తన పదవి నుంచి తప్పుకున్నారు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి రాజీవ్బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.
తన రాజీనామా లేఖను ట్విటర్లో పోస్ట్ చేసిన ఆయన.. ఇన్నాళ్లపాటు ప్రజలకు సేవ చేసినందుకు గర్వంగా ఉందని తెలిపారు. ఈ అవకాశం కల్పించినందుకు దీదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజీనామా లేఖను గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు పంపినట్లు చెప్పారు. అయితే రాజీనామాకు గల కారణాలు రాజీవ్ బెనర్జీ వెల్లడించలేదు. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాజీవ్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల మమతాబెనర్జీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి రాజీవ్ గైర్హాజరయ్యారు. దీంతో రాజీవ్ భాజపాలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి సువేందు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు భాజపాలో చేరిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి..
బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే: అభిషేక్