కొత్త రెవెన్యూ బిల్లుపై వాడీవేడీ చర్చ

తాజా వార్తలు

Published : 11/09/2020 14:19 IST

కొత్త రెవెన్యూ బిల్లుపై వాడీవేడీ చర్చ

హైదరాబాద్‌: నూతన రెవెన్యూ బిల్లుపై తెలంగాణ శాసనసభలో వాడీవేడీ చర్చ జరిగింది. తొలుత సీఎం కేసీఆర్‌ చర్చను ప్రారంభించగా ఆతర్వాత ఎంఐఎం, తెరాస, కాంగ్రెస్‌ సభ్యులు చర్చను కొనసాగించారు.ఈ సందర్భంగా.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ...రెవెన్యూ బిల్లులోని లోపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. భూ ప్రక్షాళన సమయంలో రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదయ్యాయని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తహసీల్దార్‌ల వద్దే జరగాలని సూచించారు.మ్యూటేషన్‌లో  ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు.
సమగ్ర భూ సర్వే ఎప్పుడు?

సమగ్ర భూసర్వే ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరారు. ధరణి పోర్టల్‌ను ఎవరైనా హ్యాక్‌ చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ధరణి వెబ్‌సైట్‌ సర్వ సమస్యలకు పరిష్కారం అని భావిస్తే  కొత్త సమస్యలు వస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో భూమికి, రికార్డుల్లో నమోదైన వివరాల్లో తేడాలు ఉన్నాయన్నారు. అసైన్డ్‌ భూముల సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలని కోరారు.  పలు ప్రాంతాల్లో పేదలకు ఇచ్చిన భూములనే ప్రభుత్వం తీసుకుంటుందని సభ దృష్టికి తెచ్చారు. రైతు సమన్వయ సమితుల భవనాల కోసం, వైకుంఠధామాల కోసం రైతులకు ఇచ్చిన భూములనే తీసుకుంటున్నారని తెలిపారు. పేదల భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలని భట్టి విక్రమార్క కోరారు.  సామాజిక తెలంగాణ తెచ్చుకున్న మనం పేదల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రైతులకు సహాయం కోసం రెవెన్యూ సిబ్బంది ఉంటే బాగుంటుందని సూచించారు.  సమగ్ర సర్వే సెటిల్‌మెంట్‌ పూర్తయ్యే వరకు ప్రస్తుత విధానం కొనసాగిస్తే బాగుంటుదన్నారు.

‘‘సివిల్‌ కోర్టుల ద్వారా సమస్యలు ఎలా పరిష్కరిస్తారో వివరించాలి. మ్యాన్యువల్‌గా కూడా రికార్డుల్లో వివరాలు నమోదు చేయాలి. గ్రామాల్లో రైతులకు ఉన్నటువంటి వ్యవసాయ భూములను మాత్రమే నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో బీడు భూములను నమోదు చేయలేదు. వివరాలు సరిగా నమోదుకానందున హక్కుదారులకు రైతు బంధు కూడా అందలేదు. బీడు భూములు వ్యవసాయ భూములుగా మారినా .. రికార్డుల్లో నమోదు కాలేదు. సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి’’ అని భట్టి విక్రమార్క కోరారు. భట్టి సూచనలపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ... వీఆర్వో వ్యవస్థ పోయింది .. దానిని కొనసాగించాలని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత వీఆర్వో వ్యవస్థ సరిగా లేదని వివరించారు. చట్టాలు రూపొందించేటప్పుడు విశాల దృక్పథంతో ఆలోచించాలని సూచించారు.

రెవెన్యూ బిల్లును స్వాగతించిన ఎంఐఎం

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ... నూతన రెవెన్యూ చట్టం తెచ్చిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ బిల్లును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. భూములకు సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా చాలా చోట్ల ఆక్రమణలు జరిగాయన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూమి, రికార్డులో వివరాల్లో తేడాలు ఉన్నాయని వివరించారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. వక్ఫ్‌ భూములు, దర్గా భూములు  చాలాచోట్ల ఆక్రమణలకు గురయ్యాయని సభ దృష్టికి తెచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని