Tool Kit: భాజపా, కాంగ్రెస్‌.. ఓ టూల్‌కిట్‌ రగడ!

తాజా వార్తలు

Updated : 19/05/2021 11:43 IST

Tool Kit: భాజపా, కాంగ్రెస్‌.. ఓ టూల్‌కిట్‌ రగడ!

దిల్లీ: దేశంలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్‌ను ‘ఇండియా స్ట్రెయిన్‌’, ‘మోదీ స్ట్రెయిన్‌’ అని పిలవడం ద్వారా విపక్ష కాంగ్రెస్‌ దేశ ప్రతిష్ఠతో పాటు ప్రధాని మోదీని దెబ్బతీసేందుకు యత్నిస్తోందని భాజపా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ప్రత్యేక ‘టూల్‌కిట్‌’ను రూపొందించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ‘నకిలీ టూల్‌కిట్‌’తో దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ భాజపా నేతలపై దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ వద్ద ఫిర్యాదు చేసింది. భాజపా అధ్యక్షుడు నడ్డా, ఆ పార్టీ నేతలు బి.ఎల్‌.సంతోష్, సంబిత్‌ పాత్రా, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీలపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఏంటీ వివాదం?

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కార్యకర్తలు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ ఉన్న పత్రాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి. కాంగ్రెస్‌ గుర్తుతో ఉన్న ఆ పత్రాలను భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా సహా పలువురు కమలదళ నేతలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న కరోనా కొత్త రకం మ్యుటెంట్‌ను ‘ఇండియన్‌ స్ట్రెయిన్‌’ లేదా ‘మోదీ స్ట్రెయిన్‌’ అని పిలవాలని ఆ పత్రాల్లో ఉన్నట్లు భాజపా పేర్కొంది. ‘రాజకీయ లబ్ధి కోసం విదేశీ పాత్రికేయుల సాయంతో దేశ ప్రతిష్ఠను మంటగలపడానికి కాంగ్రెస్‌ ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదు. ఒక వ్యూహం ప్రకారమే కుంభమేళాను సూపర్‌ స్ప్రెడర్‌ కుంభ్‌గా పిలవాలని ఆ పార్టీ తన సామాజిక మాధ్యమ వాలంటీర్లకు పిలుపు నిచ్చింది’ అంటూ సంబిత్‌ పాత్రా ట్వీట్‌ చేశారు. భాజపా అధ్యక్షుడు నడ్డా ట్వీట్‌ చేస్తూ...‘సమాజాన్ని విభజించడం, ఇతరులపై విషం వెళ్లగక్కడం వంటి కళల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆరితేరింది’ అని ఆరోపించారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్‌ ఖండన...ఫిర్యాదు

కొవిడ్‌ కట్టడిలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే భాజపా నేతలు నకిలీ టూల్‌కిట్‌ను తెరపైకి తీసుకొచ్చి దానిని తమ పార్టీకి ఆపాదిస్తున్నారని కాంగ్రెస్‌ ప్రతినిధి రాజీవ్‌ గౌడ ఎదురుదాడికి దిగారు. ఫోర్జరీ పత్రాలు సృష్టించడంతో పాటు దుష్ప్రచారానికి దిగిన భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, సంబిత్‌ పాత్రా, స్మృతీ ఇరానీ తదితరులపై దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేశమంతా కొవిడ్‌తో అల్లాడిపోతుంటే భాజపా నేతలు కట్టుకథలతో రాజకీయాల స్థాయిని దిగజార్చుతున్నారని, సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా మండిపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని