​​​​​దీదీ× సువేందు ఫిక్స్‌.. భాజపా తొలి జాబితా

తాజా వార్తలు

Updated : 06/03/2021 19:34 IST

​​​​​దీదీ× సువేందు ఫిక్స్‌.. భాజపా తొలి జాబితా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కీలకమైన రాజకీయ పోరుకు తెరలేచింది. అభ్యర్థుల జాబితా ప్రకటన దశలోనే అక్కడ ఎన్నికల వేడి రాజుకొంది. ఒకేసారి 291 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించి మమతా బెనర్జీ అందిరినీ ఆశ్చర్యపరచగా.. 24 గంటలు గడవకముందే 57 మందితో భారతీయ జనతా పార్టీ తొలి జాబితాతో ముందుకొచ్చింది. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌ స్థానానికి సువేందు అధికారి పేరును ఖరారు చేసి దేశమంతా ఈ స్థానం గురించి చర్చించుకునేలా చేసింది. ఈ మేరకు అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ శనివారం విడుదల చేశారు. సువేందుతో పాటు భారత మాజీ క్రికెటర్‌ అశోక్‌ దిండా, మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ భారతీ ఘోష్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 60 స్థానాలకు తొలి రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. అందులో మూడు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.

2016లో సువేందు తృణమూల్‌ తరఫున నందిగ్రామ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సువేందు తండ్రి, అన్నయ్య కూడా ఎంపీలుగా ఉన్నారు. ఈ ప్రాంతంలోని దాదాపు 40 అసెంబ్లీ సీట్లను అధికారి కుటుంబం ప్రభావితం చేస్తుందంటారు. అలాంటి సువేందు తృణమూల్‌కు గుడ్‌బై చెప్పి భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో సువేందును ఓడించేందుకు మమత రంగంలోకి దిగారు. దీంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా భాజపా సైతం సువేందును బరిలో నిలిపి రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొనేలా చేసింది. మార్చి 27 నుంచి సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో 294 స్థానాలకు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

రేపు మోదీ పర్యటన 
పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ ఆదివారం పర్యటించనున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి పలువురు నేతలు రాష్ట్రంలో పర్యటించగా.. ఇప్పుడు మోదీ సైతం రంగంలోకి దిగుతున్నారు. కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈసీ షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత భాజపా చేపడుతున్న అతిపెద్ద ఎన్నికల ప్రచారం ఇదే. ఈ ర్యాలీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా.. అత్యంత ఎక్కువ మందితో ఈ సభను నిర్వహించాలని భావిస్తోంది. భాజపా సీనియర్‌ నేత కైలాశ్ విజయ్‌ వర్గియా స్వయంగా ఇంటింటికీ వెళ్లి ర్యాలీకి ప్రజలను ఆహ్వానించారు. 

మిథున్‌ చక్రవర్తిపై కొనసాగుతున్న ఉత్కంఠ

మోదీ సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశమున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి పేరు వినిపిస్తోంది. ఈ సభలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆయన రాకపై చర్చలు జరిగినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గియా చెప్పడం గమనార్హం. ఒకప్పుడు సీసీఎంకు మద్దతుగా ఉన్న మిథున్‌.. ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కొన్ని కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని