గ్రేటర్‌లో వికసించిన కమలం 

తాజా వార్తలు

Published : 05/12/2020 01:37 IST

గ్రేటర్‌లో వికసించిన కమలం 

 48 డివిజన్లలో ఎగిరిన కాషాయ జెండా

బలమైన ప్రతిపక్షంగా దూసుకొచ్చిన భాజపా

రాష్టంలో కొత్త రాజకీయశక్తిగా అవతరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌ : హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అంచనాలకు మించి రాణించింది. గ్రేటర్‌ పరిధిలో గతంలో ఎన్నడూ లేనంత బలాన్ని చేజిక్కించుకుంది. చాలా చోట్ల స్పష్టమైన ఆధిక్యం కనబరచిన భాజపా 48 స్థానాల్లో గెలిచింది. ప్రచారంలోనూ, విమర్శలను తిప్పికొట్టడంలోనూ అధికార పార్టీకి పోటీగా మారిన భాజపా తెలంగాణలో తన ఉనికిని బలంగా చాటుకుంది.  గత గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాలకే పరిమితమైంది. అలాంటిది ఈసారి నుంచి గ్రేటర్‌లోనూ, రాష్ట్రంలో తమ ఉనికిని చాటుతూ రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చింది.

కాంగ్రెస్‌ బలహీనతను బలంగా.. 

కాంగ్రెస్‌ బలహీనతను తమ బలంగా మలుచుకున్న భాజపా తాజా పోరులో ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం కలిగించేలా చేసింది. అది ఎంతలా అంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస, భాజపాకు మధ్యే ప్రధాన పోటీ జరుగుతున్నట్లు అస్ర్తశస్త్రాలను వాడింది. ప్రధాన ప్రతిపక్షం స్థాయికి భాజపా చేరుకుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ క్రమంగా తగ్గుతూ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో కాస్త ఊపిరి పీల్చుకున్నా అది తెరాసను ఇరకాటంలో పెట్టడానికి పని చేయలేదు. అధికార పార్టీ విమర్శలను తిప్పికొట్టడంలోనూ, ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపించడంలోనూ కాంగ్రెస్‌ విఫలమైంది. దీన్ని భాజపా రెండు చేతుల్తో అందుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాల్లో గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు బలం పుంజుకోవడానికి మరింత కారణమయ్యాయి. 

బం‘ఢీ’ సంజయ్..

 

గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపా ఈ మేరకు రాణించడానికి ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకుల మాట. రాష్ట్రం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా గెలుపొందటానికి సంజయ్‌ అన్నీ తానై వ్యవహరించారు. అధికార పార్టీని ఎదుర్కోవడంలో దూకుడుగా కనిపించారు. అక్కడ విజయం సొంతం చేసుకొని దాని కొనసాగింపు గ్రేటర్‌ ఎన్నికల్లోనూ చూపించారు. పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసినా,  మజ్లిస్‌ పార్టీపై విరుచుకుపడినా.. ఇవన్నీ ఆ పార్టీకి కలిసొచ్చాయనే చెప్పాలి. విపక్షాలు వీటిని అస్ర్తాలుగా చేసుకొని ఎదురుదాడి చేసినా వాటిని తనదైన దూకుడు విధానంతో తిప్పికొట్టడంలో బండి సంజయ్‌ సఫలీకృతుడయ్యారు. 

విస్తృత ప్రయోజనాలు.. జనసేన మద్దతు

బల్దియా ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతోందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తొలుత ప్రకటించారు. తెలంగాణలో ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేయాలనే అధినేత నిర్ణయంతో జనసేన కార్యకర్తలు హర్షించారు. కాగా, కేంద్రంలో భాజపా విధానాలకు మద్దతిస్తున్న పవన్‌ కల్యాణ్‌ తన మాటను వెనక్కి తీసుకున్నారు. ఓట్ల చీలిక, విస్తృత రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపాకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.  ఇది కూడా భాజపాకు కలిసొచ్చే అంశమైంది. ఆ దిశగా పవన్‌ని ఒప్పించడంలో భాజపా సఫలమైంది. 

వలసలు..  అసంతృప్తుల చేరికలు

 

మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పరిస్థితిని వలసలు దారుణంగా దెబ్బతీశాయి. ఇవి కూడా భాజపాకు బలం చేకూర్చాయి. గతంలో మేయర్‌గా చేసిన అనుభవం ఉన్న బండ కార్తీకరెడ్డి, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్‌ అతని కుమారుడు రవికుమార్‌యాదవ్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. గత తెరాస ప్రభుత్వంలో శాసనమండలి స్పీకర్‌గా ఉన్న స్వామిగౌడ్‌ కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇవి కూడా పరోక్షంగా కొంతవరకు భాజపా మెరుగుపడేందుకు దోహదపడ్డాయని చెప్పొచ్చు. 

భాజపా అగ్రనేతల ప్రచారం..

 

బల్దియా పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా భాజపా అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, స్మృతి ఇరానీ, ప్రకాశ్‌ జావడేకర్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తదితర నాయకులు భాజపా ఎన్నికల ప్రచారాన్ని ఓ స్థాయికి తీసుకెళ్లారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, భాజపా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో పాటు భాజపా సీనియర్‌ నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్‌షోలు, ఆలయాల సందర్శనలు, ఎన్నికల మేనిఫెస్టోలో వరాలు... ఈ నేతలంతా తలో చేయి వేసి భాజపాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. 

జీహెచ్‌ఎంసీ ఫలితాల సరళిని పరిశీలిస్తే భాజపా రాష్ట్రంలో కొత్త శక్తిగా అవతరించింది. గత లోక్‌సభ ఎన్నికలు, దుబ్బాక విజయం, తాజా గ్రేటర్‌ ఫలితాలతో భాజపా అనూహ్యంగా పుంజుకుంది. ఈ విజయాలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు కచ్చితంగా అనుకూలమవనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దీంతో  రాష్ట్రంలో విస్తరించేందుకు  భాజపాకు పెద్దగా సమయం పట్టకపోవచ్చు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని