నందిగ్రామ్‌.. ఇక దీదీని నమ్ముతుందా?

తాజా వార్తలు

Updated : 11/03/2021 11:55 IST

నందిగ్రామ్‌.. ఇక దీదీని నమ్ముతుందా?

దాడి ఆరోపణలపై భాజపా ఘాటు విమర్శలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కాలికి గాయమవడం రాజకీయ వివాదానికి దారితీసింది. సీఎంపై కుట్రపూరితంగానే దాడి జరిగిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా.. భాజపా దాన్ని ఖండిస్తోంది. ఓడిపోతాననే భయంతోనే దీదీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భాజపా దుయ్యబట్టింది. నందిగ్రామ్‌ ప్రజలు ఇక దీదీని నమ్మలేరంటూ విమర్శలు గుప్పించింది.

‘‘నందిగ్రామ్‌లో తనపై దాడి జరిగిందని మమతా బెనర్జీ ఇక్కడి ప్రజలను నిందిస్తున్నారు. దీంతో ఆమె పట్ల వారు కోపంగా ఉన్నారు. నిజానికి అదో ప్రమాదం అని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మమత కారులోకి ఎక్కకముందే డ్రైవర్‌ కారును ముందుకు పోనివ్వడంతో గాయమై ఉండొచ్చని అంటున్నారు. మమత ఆరోపణలతో నందిగ్రామ్‌ ప్రజలు అసంతృప్తి చెందారు. ఇక్కడ ఎన్నికల అంచనాలతో ఆమె ఆందోళనకు గురయ్యారు. గెలుపుపై విశ్వాసం కోల్పోయారు. ప్రజలకు కూడా ఆ విషయం అర్థమైంది. ఇక దీదీని నందిగ్రామ్‌ ప్రజలు ఎన్నటికైనా నమ్మగలరా?’’ అని భాజపా ట్విటర్‌లో విమర్శించింది.

మేనిఫెస్టో విడుదల వాయిదా..

గాయం కారణంగా మమతాబెనర్జీ ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో తృణమూల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కాళీఘాట్‌లోని తన నివాసం నుంచి సీఎం మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు టీఎంసీ ప్రతినిధులు తెలిపారు.

ఈసీని కలవనున్న భాజపా, టీఎంసీ

మమతపై ‘దాడి’ దృష్ట్యా అటు తృణమూల్‌ కాంగ్రెస్‌, ఇటు భాజపా నేతలు నేడు ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. దాడిపై తృణమూల్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయనుండగా.. ఘటనపై విస్తృత దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్‌తో భాజపా నేతలు ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం కానున్నారు. రాజకీయ లబ్ధి కోసమే దీదీ.. ఈ ఘటనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని భాజపా డిమాండ్‌ చేస్తోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని