CBN: అక్రమ కేసులే వాళ్ల పని: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 25/05/2021 14:02 IST

CBN: అక్రమ కేసులే వాళ్ల పని: చంద్రబాబు

అమరావతి: తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే వైకాపా ప్రభుత్వం పనిగా పెట్టుకుందని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అరెస్ట్‌ నేపథ్యంలో కర్నూలు జిల్లా నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జనార్దన్‌ రెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు వచ్చి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారని ఆరోపించారు. పోలీసులు ఉన్నది దొంగలకు రక్షణ కల్పించడానికా? అని చంద్రబాబు నిలదీశారు. తెదేపా నేతలపై పెట్టిన అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. కర్నూలులో కరోనా, బ్లాక్ ఫంగస్‌తో ప్రజలు చనిపోతుంటే వైకాపా రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. ఆదివారం ఎనిమిది మంది తెదేపా నాయకులను అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పటికీ ఆరుగురిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని ఆరోపించారు. బీసీ జనార్దన్‌ రెడ్డి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడుతామని చెప్పారు. వైకాపా దుర్మార్గాలపై కరోనా నిబంధనలు పాటిస్తూ వర్చువల్ నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసులు చేస్తున్న దుశ్చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

జనార్దన్‌రెడ్డి అరెస్ట్‌పై డీజీపీకి లేఖ

బీసీ జనార్దన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. కర్నూలు జిల్లా బనగానపల్లె పోలీస్‌స్టేషన్‌లో జనార్దన్ రెడ్డి, అతని మద్దతుదారులపై అక్రమ కేసు బనాయించారని లేఖలో ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి, అతని అనుచరులైన వైకాపా గూండాలే జనార్దన్ రెడ్డి ఇంటిపై దాడి చేయడానికి వెళ్లారని.. వారిపై ప్రతిఘటించినందుకు అక్రమ కేసు నమోదు చేశారని లేఖలో పేర్కొన్నారు. జనార్దన్‌ రెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకు బాధితులను బలవంతంగా ఒప్పించడానికి చట్టవిరుద్ధంగా ఆరుగురిని పోలీసు కస్టడీలో ఉంచినట్లు తెలుస్తోందన్నారు. ఇటువంటి అక్రమ నిర్బంధాలు చట్ట, రాజ్యాంగ, ప్రజాస్వామ్య నిబంధనలకు విరుద్ధమని ఆక్షేపించారు. అక్రమంగా అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకులను వెంటనే విడుదల చేయాలని లేఖలో చంద్రబాబు డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ కేసులు, అరెస్టులు చేయకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డీజీపీకి విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని