విశాఖ ఉక్కు ఉద్యమంపై చిరంజీవి ట్వీట్‌ 

తాజా వార్తలు

Published : 11/03/2021 01:27 IST

విశాఖ ఉక్కు ఉద్యమంపై చిరంజీవి ట్వీట్‌ 

హైదరాబాద్‌: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి మద్దతు ప్రకటించారు. ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ బుధవారం రాత్రి ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్‌ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్‌ చేతబట్టి గోడల మీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. అది ఆంధ్రుల హక్కుగా, ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా భావించి సంతోషించాం. ‘విశాఖ ఉక్కు’కు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం’

కేంద్రం పునరాలోచించాలి

‘విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్‌ గనులు కేటాయించకపోవడం, నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాను. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాల గుర్తించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే ఇప్పుడు మనముందున్న ప్రధాన కర్తవ్యం. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన హక్కు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం’’ అని చిరంజీవి పిలుపునిచ్చారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని