కొలిక్కి వచ్చిన ‘హస్తం’ కసరత్తులు!

తాజా వార్తలు

Updated : 07/03/2021 10:48 IST

కొలిక్కి వచ్చిన ‘హస్తం’ కసరత్తులు!

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికల కాక రోజురోజుకూ రాజుకుంటోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పెట్టుకున్న పొత్తుల్లో భాగంగా సీట్ల కేటాయింపులు ఓ కొలిక్కి వచ్చాయి.. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మరోవైపు తాజాగా తమిళనాడులోనూ సీట్ల పంపకం కొలిక్కి వచ్చినప్పటికీ ఇంకా అభ్యర్థుల పేర్లు ఖరారు కాలేదు.

తమిళనాడులో 25 స్థానాల్లో..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా స్థానాల పంపకాలపై కసరత్తు పూర్తయింది. కాంగ్రెస్‌కు డీఎంకే 25 స్థానాలు కేటాయించింది.  కన్యాకుమారి లోక్‌సభ స్థానాన్ని కూడా కాంగ్రెస్‌కు కేటాయించింది. ఈ మేరకు ఒప్పందంపై ఇరు పార్టీలు తుది నిర్ణయానికి వచ్చాయి. గతంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు 41 స్థానాలు కేటాయించగా.. కేవలం ఏడు స్థానాల్లోనే విజయం సాధించడం గమనార్హం.

తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరోవైపు తమిళనాడులో అధికార అన్నాడీఎంకే ఇప్పటికే తమతో పొత్తులో ఉన్న భాజపాకు 20 స్థానాలు కేటాయిస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నిక స్థానాన్ని భాజపాకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

బెంగాల్‌లో 13 మందితో తొలి జాబితా

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. తొలి రెండు దశల ఎన్నికల్లో పాల్గొననున్న 13 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ తొలి జాబితాలో పార్టీ సీనియర్‌ నేత నేపాల్‌ మహతో ఉన్నారు. ఈయన బాఘ్‌ముండి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. టీఎంసీ ఇప్పటికే మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు భాజపా 57 స్థానాలకు శనివారం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది.

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు 8దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే2న చేపట్టనున్నారు. కాగా, కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో తమ దీర్ఘకాల ప్రత్యర్థి అయిన వామపక్షాలు, ఐఎస్‌ఎఫ్‌లతో కలిసి బరిలో దిగుతుండటం గమనార్హం. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ 92 స్థానాల్లో బరిలో దిగడానికి ఒప్పందం కుదుర్చుకొంది.

అసోంలో 40 మందితో
అసోంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఇందులో భాగంగా 40 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మార్చి 27న జరగబోయే తొలి దశ ఎన్నికల్లో పోటీ చేయబోయే వారిలో.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ పార్టీ అవకాశం కల్పించింది. ప్రతిపక్ష నేత దేవవ్‌టాట సైకియా నజ్రియా స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 

గోలాఘాట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున ఇటీవల భాజపాకు స్వస్తి చెప్పిన బిటుపన్‌ సైకియా బరిలో దిగారు. ఇదే నియోజకవర్గానికి భాజపా తరపున ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కాంగ్రెస్‌ మాజీ మంత్రి అజంతా నియోగ్‌ టికెట్‌ సాధించారు. కాగా, ఎలాగైనా ఈ సారి అసోంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా కూటమిలో ఏఐయూడీఎఫ్‌, బీపీఎఫ్‌, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌), అంచాలిక్‌ గణ్‌ మోర్చా పార్టీలు ఉన్నాయి. 126 స్థానాలు ఉన్న అసోం అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలు మార్చి 27న నిర్వహించనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని