
తాజా వార్తలు
పుదుచ్చేరిలో పట్టు కోల్పోయిన కాంగ్రెస్..
మూడు రాష్ట్రాల్లోనే సొంతంగా అధికారంలో..
దిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్యే పంజాబ్ స్థానిక ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరచిన కాంగ్రెస్‌కు, సంతోషాన్ని ఆస్వాదించకముందే తాజాగా పుదుచ్చేరిలో మరోరూపంలో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ప్రస్తుతం దేశంలో పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనే సొంత మెజారిటీతో ప్రభుత్వాలను కొనసాగిస్తోంది. ఇక, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ కూటమితో అధికారంలో కొనసాగుతోన్న జాతీయ కాంగ్రెస్, ఝార్ఖండ్‌లోనూ జేఎంఎం సహకారంతో ప్రభుత్వాన్ని నడుపుతోన్న విషయం తెలిసిందే.
2019 ఎన్నికల తర్వాతే అదేతీరు..
కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపా, పలు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి కోలుకోలేకపోతున్నట్లే కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొద్ది కాలానికే జ్యోతిరాదిత్య సింధియా భాజపాలోకి వెళ్లడంతో అక్కడ కూడా అధికారాన్ని కోల్పోయింది. పార్టీలో నేతల అంతర్గత విభేదాల కారణంగా అక్కడ అధికారాన్ని కోల్పోయినట్లు స్పష్టంగా కనిపించింది. దిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పేలవమైన ప్రదర్శన కనబరచిన కాంగ్రెస్, దిల్లీలో ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్న సమయంలోనే అటు మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రాణసంకటంగా మారింది. తాజాగా పుదుచ్చేరిలోనూ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది.
అక్కడ వామపక్షాలే బెటర్..
దేశంలో కరోనా విజృంభణ వేళ బిహార్‌లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారు. కొవిడ్‌పై కేంద్రం ప్రభుత్వం పోరు, లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలపై కేంద్ర పనితీరును విమర్శించిన కాంగ్రెస్‌కు బిహార్‌లోనూ ఎదురుదెబ్బే తగిలింది. అక్కడ కాంగ్రెస్ కంటే వామపక్షాలే మెరుగైన ప్రదర్శన కనబరిచాయంటే కాంగ్రెస్ పనితీరు స్పష్టమవుతోంది.
రాజస్థాన్‌లోనూ ఒడిదొడుకులే..
రాజస్థాన్‌లో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నామని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీలోనే ప్రకంపనలు మొదలయ్యాయి. రెబల్ నేత సచిన్ పైలట్ తన మద్దతుదారులతో క్యాంప్ ఏర్పాటుచేసి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. చివరకు కాంగ్రెస్ అధినాయకత్వం చొరవతో అక్కడి పరిస్థితులు చక్కబడడంతో రాజస్థాన్‌లో అధికారాన్ని నిలుపుకోగలిగింది. అయినప్పటికీ సచిన్ పైలట్, ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మధ్య దూరం కొనసాగుతూనే ఉన్నట్లు సమాచారం.
ఆ ఐదు రాష్ట్రాలపైనే ఆశలు..
పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ధీనంగా మారిన నేపథ్యంలో మరికొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి ఆశాదీపంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే పుదుచ్చేరిలో అధికారాన్ని కోల్పోవడం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లుయ్యింది. అయితే, వచ్చే రెండు మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో పుదుచ్చేరిలో మరోసారి గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తంచేస్తోంది. ఇక తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించాలనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతోన్న భాజపాతో పాటు ఎంఐఎం ఎంట్రీ ఇవ్వడం కూడా కాంగ్రెస్-వామపక్షాలకు కంటిలో నలతగా మారాయి.
ఇలా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోతున్నప్పటికీ, ఓటర్లను తమవైపు గాంధీ కుటుంబం తిప్పుకోలేకపోతుందనే వాదన ఎక్కువైంది. ఇందులో భాగంగానే, పార్టీకి చెందిన గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి 23 మంది సీనియర్ నాయకులు పార్టీ హైకమాండ్‌ను గతంలోనే హెచ్చరించారు. అయితే, కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దిల్లీకే పరిమితం కాగా, అన్ని బాధ్యతలు తన భుజాల మీద వేసుకున్న రాహుల్ గాంధీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పనితీరు కనబరుస్తుందనే విషయంపై వేచిచూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.