Politics: కాంగ్రెస్‌లో సంస్కరణలు అవసరం: సిబల్‌
close

తాజా వార్తలు

Published : 14/06/2021 01:39 IST

Politics: కాంగ్రెస్‌లో సంస్కరణలు అవసరం: సిబల్‌

దిల్లీ: కాంగ్రెస్‌లో అన్ని స్థాయిల్లోనూ విస్తృత సంస్కరణలు అవసరమని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. అధికార భాజపాకు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయమని నిరూపించేందుకు పార్టీ అంతర్గత మార్పులు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీలో పదవులు కేటాయించాలంటూ గతంలో అధినేత్రి సోనియాకు లేఖలు రాసిన 23 మందిలో కపిల్‌ సిబల్‌ కూడా ఉన్నారు. అప్పట్లో పార్టీలో ఇది ప్రకంపనలు సృష్టించింది. సంస్థాగత ఎన్నికలు తప్పవని అందరూ అనుకున్నారు. కానీ, కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడ్డాయి. అయితే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజా మరోసారి కపిల్‌ సిబల్‌ స్పందించడం చర్చనీయాంశమైంది.

దిల్లీలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిబల్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం భాజపాకు సరైన ప్రతిపక్ష పార్టీ లేదనేది వాస్తవమే. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వంపైనా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఇటీవల అసోం, పశ్చిమ్‌బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. కాంగ్రెస్‌ బలమైన శక్తిగా అవతరించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ విధానాలు నచ్చకే జోతిరాధిత్య సింధియా, జితిన్‌ ప్రసాద లాంటి యువనాయకులు కాంగ్రెస్‌ నుంచి వైదొలుగుతున్నారు. ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతోనే బయటకు వస్తున్నారు’’ అని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ ప్రత్నామ్నాయాలకు ఆస్కారముందని, అయితే కాంగ్రెస్‌లోనూ సమూల మార్పులు చేపట్టాల్సిన అవసరముందని సిబల్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానికి కూడా సూచించానని చెప్పారు. అయితే  ఏది మంచిదో నిర్ణయించుకునే సమయం దేశ ప్రజలకు కచ్చితంగా వస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌లో సరైన నాయకులను గుర్తించి, రానున్న ఎన్నికల్లో వారిని బరిలో నిలిపేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాల్సిన అవసరముందని సిబల్‌ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కసరత్తు మొదలు పెట్టాలన్నారు. తాజా ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. సరైన ప్రతిపక్షం ఉంటే భాజపాను గద్దె దించడం అంత కష్టమేమీ కాదని సిబల్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ్‌బెంగాల్‌, కేరళ, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ విఫలమవడంపై నియోజవర్గ స్థాయిలో సమీక్ష చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయడాన్ని ఆయన స్వాగతించారు. ఎన్ని సమీక్షలు చేసినా, కమిటీలు వేసినా సరైన మార్గం చూపేవారు, వాటిని ఆచరించేవారు లేనప్పుడు గ్రౌండ్‌ లెవెల్‌లో వాటివల్ల పెద్దగా ఉపయోగమేమీ ఉండదని కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని