కుట్రలు నన్ను ఆపలేవు..! మమతా బెనర్జీ

తాజా వార్తలు

Published : 16/03/2021 01:33 IST

కుట్రలు నన్ను ఆపలేవు..! మమతా బెనర్జీ

చక్రాల కుర్చీలోనే ఎన్నికల ప్రచారం

బలరాంపూర్‌: తనలో ఊపిరి ఉన్నంతవరకూ భారతీయ జనతా పార్టీపై పోరు కొనసాగిస్తానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. ఇందుకోసం జరుగుతోన్న పోరులో తనను ఎదుర్కొనేందుకు ఎన్ని కుట్రలు, గాయాలు చేసినా ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. పురులియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీదీ, వీల్‌ ఛైర్‌ సహాయంతోనే సభకు హాజరయ్యారు.

‘కొన్నిరోజులు ఓపిక పట్టండి. నా కాలు నయం అవుతుంది. మీ కాళ్లు బెంగాల్‌ నేలపై ఎలా పరుగెత్తుతాయో నేనూ చూస్తాను’ అంటూ కాషాయ పార్టీని ఉద్దేశిస్తూ మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. దిల్లీ నుంచి నాయకులను భాజపా తీసుకువస్తున్నప్పటికీ ఇక్కడి ప్రజల ఐక్యతను ఎన్నటికీ విడదీయలేరని అన్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ చేయనంతగా తమ ప్రజలకు తృణమూల్‌ ప్రభుత్వం చేసిందన్నారు. ఇక పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను ప్రస్తావించిన దీదీ, కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే సమర్థత నరేంద్ర మోదీకి లేదని విమర్శించారు. అంతేకాకుండా, కాంగ్రెస్‌, సీపీఎం పార్టీలకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చిన ఆమె, ఈ మూడు పార్టీలు సోదరభావం కలిగినవేనన్నారు.

రాష్ట్రం నుంచి భాజపా తరపున 18మంది ఎంపీలు ఎన్నికైనా బెంగాల్‌కు చేసిందేమీ లేదని మమతా బెనర్జీ విమర్శించారు. కేవలం అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటూ రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇక స్థానికతపై చర్చ జరుగుతోన్న వేళ.. రాష్ట్రంలో అశాంతి కలుగజేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు కొందరు వస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందన్నారు. అందుకే రాష్ట్ర సరిహద్దులను కట్టుదిట్టం చేయాలని పురులియా అధికారులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని