దీదీది ‘ఆట’.. మాది ‘అభివృద్ధి’
close

తాజా వార్తలు

Published : 18/03/2021 13:22 IST

దీదీది ‘ఆట’.. మాది ‘అభివృద్ధి’

టీఎంసీకి కొత్త అర్థం చెప్పిన ప్రధాని మోదీ

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఇక్కడ అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న భాజపా.. ప్రచారంలో వేగం పెంచింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. పురూలియాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని..  సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. ‘ఖేలా హోబె(ఆట మొదలైంది)’ అని దీదీ పదే పదే చెబుతున్నారని, కానీ భాజపా మాత్రం వికాస్‌ హోబె(అభివృద్ధి మొదలైంది) అని అంటోందన్నారు. 

‘‘ఖేలా హోబె అని దీదీ చెబుతున్నారు.. కానీ చాక్రీ హోబె(ఉద్యోగాలు మొదలయ్యాయి) అని భాజపా చెబుతోంది. వికాస్(అభివృద్ధి) హోబె, శిక్ష(విద్య) హోబె.. అని మేం అంటున్నాం. ఖేలా శేష్‌ హోబె, వికాస్‌ ఆరంభ్‌ హోబె(ఆటకు ముగింపు మొదలైంది. అభివృద్ధికి ఆరంభం మొదలైంది)’’ అని మోదీ నినదించడంతో సభ అంతా చప్పట్లతో మార్మోగింది. 

టీఎంసీ అంటే..

ఈ సందర్భంగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీపై మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీఎంసీ అంటే ట్రాన్స్‌ఫర్‌ మై కమిషన్‌ పార్టీ అని పార్టీ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో కట్‌ మనీ(కమిషన్‌) లేనిదే ఏ పని జరగదని ఆరోపించారు. కానీ, భాజపా మాత్రం డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానాన్నే విశ్వసిస్తుందని తెలిపారు. ప్రజలకు ప్రయోజనాలను నేరుగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

‘‘దీదీ మాపై ఎప్పుడూ విసుగు చూపిస్తూనే ఉంటారు. కానీ, మా వరకు, కోట్లాది మంది భారత పుత్రికల్లాగే దీదీ కూడా కుమార్తె లాంటిది. ఆమె అంటే మాకు ఎప్పటికీ గౌరవమే. అందుకే ఆమెకు గాయమైనప్పుడు మేం ఆందోళన చెందాం. ఆమె కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’- మోదీ

గతంతో వామపక్షాలు, ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌.. పురూలియాలో పరిశ్రమల అభివృద్ధిని జరగనివ్వట్లేదని మోదీ దుయ్యబట్టారు. ఇక్కడి పంటపొలాలకు సాగునీరు అందించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రైతులను వదిలేసి టీఎంసీ ప్రభుత్వం తమ సొంత ఆట ఆడుకున్నాయని ఎద్దేవా చేశారు. దీదీ, ఆమె కార్యకర్తలు మావోయిస్టులను ప్రోత్సహించారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. దళితులు, ఆదివాసులు, ఇతర వెనుకబడిన వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ‘‘సుదీర్ఘకాలంగా మీరు(మమతా బెనర్జీ ప్రభుత్వం) ప్రజలను అణగదొక్కారు. ఇప్పుడు ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మీకు ఓటమి తప్పదు’’ అని మోదీ అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని