నందిగ్రామ్‌లో దీదీ × సువేందు..! 

తాజా వార్తలు

Published : 05/03/2021 11:54 IST

నందిగ్రామ్‌లో దీదీ × సువేందు..! 

కీలక పోరుకు అధికారి పేరు దాదాపు ఖరారైనట్లే

కోల్‌కతా: రసవత్తరంగా మారిన పశ్చిమబెంగాల్‌ శాసన సభ ఎన్నికల్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్న నందిగ్రామ్‌లో దీదీ వర్సెస్‌ సువేందు పోరు దాదాపు ఖరారైనట్లే కన్పిస్తోంది. ఈ స్థానం నుంచి కీలక నేత సువేందు అధికారిని బరిలోకి దించాలని భాజపా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

అసోం, బెంగాల్‌ తొలి దశ ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేసేందుకు గురువారం రాత్రి భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.. అభ్యర్థుల ఎంపికపై కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. బెంగాల్‌లో కీలక అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన నందిగ్రామ్‌లో దీదీకి పోటీగా.. ఇటీవలే తృణమూల్‌ నుంచి భాజపాలో చేరిన సువేందునే నిలబెట్టేందుకు ఈ సమావేశంలో భాజపా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక మమత పోటీ చేయనున్న మరో స్థానం భవానీపూర్‌లో కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై మోదీ, అమిత్ షా, నడ్డా నేడు మరోసారి భేటీ అయి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్‌, అసోం తొలి దశ ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల జాబితా నేడు లేదా రేపు ప్రకటించే అవకాశముంది. 

భాజపాకు దీదీ సవాల్‌.. 

ఒకప్పుడు తృణమూల్‌లో కీలక నేత, దీదీకి అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి పార్టీని వీడి భాజపాలో చేరారు. సువేందు కుటుంబానికి  నందిగ్రామ్‌, జంగల్‌మహల్‌ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. దీంతో ఆయన పార్టీ మారడంతో ఈ ప్రాంతంలో తృణమూల్‌ బలం కోల్పోయినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మధ్య నందిగ్రామ్‌లో పర్యటించిన దీదీ.. వచ్చే ఎన్నికల్లో తాను ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి భాజపాకు సవాల్‌ విసిరారు. భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్‌ నుంచి కూడా బరిలోకి దిగుతానన్నారు. వచ్చే వారంలో ఈ స్థానం నుంచి దీదీ నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. 

ఓడించకపోతే రాజకీయాలను వీడుతా..

దీదీతో పోటీకి తాను సిద్ధమేనని సువేందు గతంలోనే ప్రకటించారు. ఒకవేళ పార్టీ తనను నిలబెడితే.. మమతా బెనర్జీని 50వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, విజయం సాధించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ధైర్యముంటే భవానీపూర్‌ కాకుండా ఒక్క నందిగ్రామ్‌ నుంచే పోటీ చేయండంటూ దీదీకి ప్రతి సవాల్‌ విసిరారు. నిన్న జరిగిన భాజపా సమావేశంలోనూ సువేందు ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. నందిగ్రామ్‌లో గెలుపుపై తాను ధీమాగా ఉన్నానని ఆయన హైకమాండ్‌కు తెలిపినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. 

సువేందు అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడితే.. బెంగాల్‌ ఎన్నికల్లో నందిగ్రామ్‌ పోరు ఉత్కంఠగా మారుతుంది. పదేళ్ల క్రితం బెంగాల్‌లో అధికారం లెఫ్ట్‌ పార్టీల నుంచి తృణమూల్‌ చేతికి రావడంలో నందిగ్రామ్‌ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది సువేందు కుటుంబమే.  
సీపీఎంకు కంచుకోటగా ఉన్న జంగల్‌మహల్‌ ప్రాంతాన్ని తృణమూల్‌ వైపు తిప్పడంలో అధికారి కుటుంబానిదే కీలక పాత్ర. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాకు చెందిన  అధికారి.. ముర్షిదాబాద్‌, మాల్దా, పురూలియా, బంకురాలలో రాజకీయంగా అధిక ప్రభావం చూపగలిగిన నాయకుడు. ఈ జిల్లాల్లోనే తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి పునాదులు ఏర్పడేందుకు ఆయన క్షేత్రస్థాయిలో విశేషంగా పనిచేశారు. జంగల్‌ మహల్‌ ప్రాంతంలో దాదాపు 40కి పైగా స్థానాల్లో (మొత్తం అసెంబ్లీ స్థానాలు 294) అధికారి కుటుంబానికి మంచి పట్టుంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని