యూపీ సీఎంకు ఆ నైతిక హక్కు లేదు: స్టాలిన్‌

తాజా వార్తలు

Published : 02/04/2021 01:41 IST

యూపీ సీఎంకు ఆ నైతిక హక్కు లేదు: స్టాలిన్‌

కోయంబత్తూర్‌: మహిళలకు భద్రత కల్పించడంలో ఉత్తర్‌ప్రదేశ్‌ పూర్తిగా విఫలమైందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విమర్శించారు. మహిళా భద్రత గురించి మాట్లాడే నైతిక విలువ యూపీ ముఖ్యమంత్రికి లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూర్‌ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన స్టాలిన్‌, భాజపా విమర్శలను తిప్పికొట్టారు.

‘మహిళలపై దాడులు, లైంగిక వేధింపుల కేసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోనే అత్యధికంగా చోటుచేసుకుంటున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో మహిళల భద్రతపై ఆ ముఖ్యమంత్రి మాట్లాడుతుండటం హాస్యాస్పదం’ అని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌పై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. కేవలం ఆదిత్యనాథ్‌ కాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడాన్ని స్టాలిన్‌ తప్పుపట్టారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఉన్న అనుమానాలపై వారు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మహిళా భద్రత విషయంలో డీఎంకేను విమర్శించే నైతిక విలువ భాజపాకు లేదన్నారు.

కేవలం ఈ అంశమే కాకుండా అభివృద్ధి విషయంలోనూ భాజపాకు శ్రద్ధ లేదని ఎంకే స్టాలిన్‌ విమర్శించారు. 2017లో మధురైలో ఎయిమ్స్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారని.. కానీ, ఇప్పటికీ అక్కడ కేవలం ఒక్క ఇటుక మాత్రమే ఉండడం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు (ఆ ఇటుకను చూపిస్తూ స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి మారన్‌ ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు). ఇక తమిళనాడులో అడుగు పెట్టేందుకు భాజపా చేస్తోన్న ప్రయత్నాలు విఫలమవుతాయని స్టాలిన్‌ జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇదిలాఉంటే, డీఎంకే నేత ఎ.రాజా, మరో ఎమ్మెల్యే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మహిళలపై వీరు చేసిన వ్యాఖ్యలనే అటు అధికార పక్షం, భాజపా ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని