బెంగ వద్దు.. ఓటెయ్యండి: మమత

తాజా వార్తలు

Published : 26/04/2021 01:14 IST

బెంగ వద్దు.. ఓటెయ్యండి: మమత

కోల్‌కతా: దేశంలో కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆరోపించారు. ప్రధానంగా ఆక్సిజన్‌ కొరతను అధికమించలేకపోతోందని, వ్యాక్సిన్‌ ధరల నిర్ణయం విషయంలో చేతులెత్తేసిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం మాటలకే పరిమితమవుతున్నారు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సోమవారం జరగబోయే ఎన్నికల్లో కరోనా బాధితులు కూడా ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. ‘‘కరోనా వైరస్‌ గురించి ఎలాంటి భయం అక్కర్లేదు. నేను మీ వాచ్‌మన్‌గా ఉంటాను‌’’ అని మమత ప్రజలకు భరోసా ఇచ్చారు. వర్చువల్‌గా నిర్వహించిన ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను ఎన్నికల ప్రచారాల కంటే కొవిడ్‌ ప్రచారసభలే ఎక్కువ నిర్వహించినట్లు చెప్పారు.

కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంపై ఆంక్షలు విధిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడానికి కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిని అధికార తృణమూల్‌ తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్రంతో కుమ్మక్కై ఈసీ నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడింది. కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న వేళ.. మిగతా విడత ఎన్నికలన్నింటినీ కలిపి ఓకే విడతగా నిర్వహించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టిందని విమర్శించింది. 

దేశంలో భాజపాను ఎదిరించే సత్తా కేవలం తృణమూల్‌కు మాత్రమే ఉందని, అందువల్ల ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని మమతా బెనర్జీ అన్నారు. అందుకే యావత్‌ దేశమంతా బెంగాల్‌ ఎన్నికలవైపు చూస్తోందన్నారు. ప్రధాని మోదీ నిర్వహించాల్సింది.. మన్‌కీ బాత్‌ కాదని, కొవిడ్‌ కా బాత్ అని మమత విమర్శించారు. బెంగాల్‌ అవసరాలను పక్కన పెట్టి ఇక్కడి నుంచి ఆక్సిజన్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఒకే దేశం ఒకే నేత.. అని చెబుతుంటారని.. మరి కరోనా వ్యాక్సిన్ల విషయంలో అది ఏమైందని ఆమె ప్రశ్నించారు. వ్యాక్సిన్లన్నీ గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకే ఎందుకు తరలి వెళ్లిపోతున్నాయి? అని ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని