‘‘తెలంగాణ అసహ్యించుకునేలా దుష్ర్పచారం’’
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 12:59 IST

‘‘తెలంగాణ అసహ్యించుకునేలా దుష్ర్పచారం’’

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్: యావత్‌ తెలంగాణ అసహ్యించుకునేలా తనపై దుష్ప్రచారం చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాల భూములు ఆక్రమించానని, కుంభకోణాలు చేసినట్లు ఆరోపించారన్నారు. 19 ఏళ్లపాటు సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేశారని ఈటల అన్నారు. ఫ్లోర్‌ లీడర్‌గా కూడా తనకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు. సోమవారం శామీర్‌పేటలో మీడియా సమావేశం నిర్వహించిన ఈటల మాట్లాడుతూ.. పార్టీకి మచ్చ తెచ్చే పని ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు.

పార్టీకి మచ్చ తెచ్చే పని ఎప్పుడూ చేయలేదు: ఈటల

‘‘మంత్రిగా కూడా కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్‌కు మచ్చతెచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో అసెంబ్లీలో పోరాడే అవకాశం కల్పించారు. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ఏనాడు అధర్మం వైపు వెళ్లలేదు. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ఏనాడూ అణచివేతకు భయపడలేదు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారు కానీ డబ్బులను నమ్ముకోలేదు. అలాంటి కేసీఆర్‌ నాలాంటి సాధారణ వ్యక్తిపై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారు. నాపై అన్ని శాఖలను ఉపయోగిస్తున్నారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పిలిపించుకొని చర్చోపచర్చలు జరిపారు’’ అని ఈటల అన్నారు. 

‘‘కేసులు పెట్టొచ్చు.. కానీ చట్టం ఉంది’’

‘‘చర్చల తర్వాత అసత్య ప్రచారానికి ఒడిగట్టడం కేసీఆర్‌ స్థాయికి తగదు. కేసీఆర్‌తో అడుగు వేశాక పూర్తిగా ప్రజల్లో ఉన్నాం తప్ప ఎక్కడా లేం. పిల్లలు, మా భవిష్యత్‌ ఏమిటని నా భార్య అడిగేవారు. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసి ఉంటే నేను శిక్షకు అర్హుడిని. ఏవో భూమలు చూపించి మావి అని చెబుతున్నారు. రాజ్యం మీ చేతిలో ఉండవచ్చు, అధికారులు మీరు చెప్పింది చేయవచ్చు. భూములు కొలుస్తామని ఒక్క నోటీసు అయినా ఇచ్చారా? మేము లేకుండా వందల మంది పోలీసులను పెట్టి సర్వే చేయడం మీకు న్యాయసమ్మతమేనా?రాజ్యం చాలా శక్తిమంతమైంది. సీఎంగా మీకు ఎదురు చెప్పే పరిస్థితి ఎవరికీ లేదు. నాపై కేసులు పెట్టవచ్చు.. కానీ చట్టం ఉంది’’ అని మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రజలు హర్షించరు’’

‘‘అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే ప్రజలు హర్షించరు. నాపై కేసులు ఎలా పెడతారు. మీరు ఏది చెబితే అది చేసే అధికారులు మీ చేతుల్లో ఉన్నారు. మీ అధికారులకు వావివరసలు లేవు. జమున వైఫ్‌ ఆఫ్‌ నితిన్‌రెడ్డి అని రాశారు. మీకు కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. పౌల్ట్రీ విస్తరణ పనుల కోసం షెడ్లు వేసుకున్నాం. కొంత భాగం అసైన్డ్‌ భూముల్లో పోయింది. భూమికి బదులు భూమి ఇస్తామన్నారు. కార్మికుల కోసం షెడ్లు వేస్తే 66 ఎకరాలు కబ్జా చేసినట్లు నివేదిక ఇచ్చారు’’ అని ఆయన అన్నారు. గతంలో పౌరసరఫరాల మంత్రిగా పని చేశా. ఆ దిశగా కూడా కేసులు పెట్టొచ్చు. ప్రేమతో లొంగదీసుకుంటే లొంగేవాడిని. భయపెడితే లొంగేవాడిని కాదు. ఎంతనష్టపోయినా లొంగేవాడిని కాదు. పార్టీ పెడతానని.. పార్టీ మారతానని ఎప్పుడూ చెప్పలేదు. 

కేసులకు భయపడే వ్యక్తిని కాదు

‘నాపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థతో విచారణ జరపాలి. కలెక్టర్‌ నివేదిక మాకు అందలేదు. మా వివరణ కూడా అడగలేదు. ప్రభుత్వం నుంచి 5 పైసలు సాయం తీసుకోలేదు. 5 కుంటల భూమి పొందలేదు. నీ అరెస్టులు.. కేసులకు భయపడే వ్యక్తిని కాదు. నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు. ఎంత పెద్ద కేసులైనా పెట్టండి.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా. మీ శిష్యరికంలో నేర్చుకున్న ప్రజలనే నమ్ముకుంటా. అసైన్డ్‌ భూముల్లో కంపెనీలు రోడ్లు వేయలేదా?మీకు వ్యవసాయ క్షేత్రం ఉంది.. రోడ్లు వేయలేదా.?’’ అని ఈటల ప్రశ్నించారు. 

కలెక్టర్‌ నివేదిక పచ్చి అబద్దం

‘‘భూ కబ్జా ఆరోపణలపై ప్రలోభపెట్టి కొందరితో మాట్లాడించారు. స్వయంగా సర్పంచ్‌ మాట మార్చారు. మీ నిజాయితీ, ధర్మానికి ఇదే నిదర్శనం. దేవరయాంజిల్‌ భూముల విషయంలో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని ఆనాడు వైఎస్‌ఆర్‌తో సవాలు చేశా. నా కోసం దేవరయాంజిల్‌ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. అవి దేవాదాయ భూములు అని కాగితాలు తీసుకురండి. కలెక్టర్‌ నివేదిక పచ్చి అబద్దం. ఎందుకు దూరమయ్యామో సీఎం అంతరాత్మకు తెలుసు. కారు గుర్తుపై గెలిచా కాబట్టి రాజీనామా చేయమని అడగవచ్చు. నేను కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈటల రాజేందర్‌ పదవుల కోసం పెదవులు మూయడు. హుజూరాబాద్‌ కార్యకర్తలతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తాం. నా మొత్తం ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి’’ అని ఈటల వ్యాఖ్యానించారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని