
తాజా వార్తలు
‘డబ్బు పంచకుండా ప్రధాని గెలిస్తే నా ఆస్తి వదిలేస్తా’
అనంతపురం: పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల్లో డబ్బే కీలకపాత్ర పోషించిందని.. ఆధిపత్యం కోసం ఓటుకు రూ.5వేలు కూడా పంచారని తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచకుండా ప్రధానమంత్రి గెలిస్తే తన ఆస్తి మొత్తం వదిలేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేసీ మాట్లాడారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు బహిరంగంగా బెదిరించారని ఆరోపించారు. తాడిపత్రిలో ఏడాది క్రితం మున్సిపల్ ఎన్నికలకు ఓ నేత నామినేషన్ దాఖలు చేస్తే వైకాపా నేతలు చించేశారని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.
ప్రాధాన్యం లేని స్థానాలకు బదిలీ చేస్తారేమోనని అధికారులు భయపడుతున్నట్లు జేసీ చెప్పారు. కొన్ని నిర్ణయాలు తప్పు అని తెలిసినా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ మనసును కష్టపెట్టుకుని, క్షోభ పడుతున్నారన్నారు. వారి పరిస్థితినీ అర్థం చేసుకోవాలని.. నిస్సహాయులైపోయారని జేసీ వ్యాఖ్యానించారు.