పోలింగ్‌ వేళ కాల్పులు.. ఐదుగురి మృతి
close

తాజా వార్తలు

Updated : 10/04/2021 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలింగ్‌ వేళ కాల్పులు.. ఐదుగురి మృతి

బెంగాల్‌లో ఉద్రిక్తత

కోచ్‌బిహార్‌: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. కోచ్‌బిహార్‌ జిల్లాలో తృణమూల్‌, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. అంతకుముందు ఇదే ప్రాంతంలో ఓ యువ ఓటరు మృతిచెందారు. 

కోచ్‌బిహార్‌లోని సీతల్‌కుచిలో గల ఓ పోలింగ్‌ కేంద్రం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆనంద్‌ బుర్మాన్‌ అనే ఓ యువ ఓటరుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ ఓటరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఈ హత్యపై భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఘటన వెనుక కాషాయ పార్టీ హస్తం ఉందని టీఎంసీ ఆరోపించింది. అయితే మృతుడు తమ పోలింగ్‌ ఏజెంట్‌ అని, అధికార పార్టీయే అతడిపై కాల్పులు జరిపిందని భాజపా దుయ్యబట్టింది.

కాల్పుల నేపథ్యంలో తృణమూల్‌, భాజపా మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఘర్షణకు దిగారు. బాంబులు విసురుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆందోళనకారులపై లాఠీఛార్జ్‌ చేశాయి. అయినప్పటికీ పరిస్థితి సద్దుమణకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసులు, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది భారీగా మోహరించారు.

భాజపా నేత కారుపై దాడి..

మరోవైపు హుగ్లీ ప్రాంతంలో భాజపా అభ్యర్థి లాకెట్‌ ఛటర్జీ కారుపై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులపై, వాహనాలపైనా దాడి చేశారు. ఈ ఘటనపై లాకెట్‌ ఛటర్జీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘‘నా కారుపై దాడి చేసి నన్ను గాయపర్చారు. ఈ ప్రాంతంలో రిగ్గింగ్‌ జరుగుతోంది. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్నికల అధికారులు వచ్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు’’ అని అమె చెప్పారు.

9 గంటలకు పోలింగ్‌ ఎంతంటే..

నాలుగో దశలో భాగంగా 44 నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది. 373 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 9 గంటల సమయానికి 15.85శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికలు అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని