మేమొస్తాం.. మీరూ రండి.. తేల్చుకుందాం

తాజా వార్తలు

Updated : 02/01/2020 19:52 IST

మేమొస్తాం.. మీరూ రండి.. తేల్చుకుందాం

తెదేపా నేత బొండా ఉమా సవాల్‌
వైకాపా వాళ్లకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అర్థం తెలుసా అని ప్రశ్న

అమరావతి: రాజధాని భూముల విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని తెదేపా నేత బొండా ఉమ విమర్శించారు. నకిలీ పత్రాలతో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఇన్‌సైడర్‌ ట్రేడింగంటే వైకాపా నేతలకు అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. ముందు కంపెనీల చట్టం గురించి తెలుసుకోవాలని అంబటికి హితవు పలికారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వైకాపా ఎమ్మెల్యే అంబటి వీడియో ప్రదర్శించిన అనంతరం ఉమ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు, భూములకు సంబంధించిన వ్యవహారాలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చట్టం కిందకు రావన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. కంపెనీ సమాచారాన్ని డైరెక్టర్లు లీక్‌ చేస్తే దాన్ని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటారని బొండా అన్నారు.  

వేమూరి రవి అనే ఎన్నారై లోకేశ్‌ బినామీ అని వైకాపా ప్రచారం చేస్తోందని ఉమ అన్నారు. ఆయన 2003లో ఆరెకరాలు కొన్నారని, అప్పటికి రాష్ట్రం కూడా ఏర్పడలేదన్నారు. దానికి ఇన్‌సైడర్‌ ట్రేండింగ్‌ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైఎస్‌ఆర్‌, కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలో వేల ఎకరాలు పరిశ్రమలకు కేటాయించారని, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన భూ కేటాయింపులను కూడా తెదేపా ప్రభుత్వంపై వేస్తున్నారని మండిపడ్డారు.
అలాగే ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తెదేపా నేతలు భూములు కొంటే అక్రమం.. వైకాపా నేతలు కొంటే సక్రమమా? అని ప్రశ్నించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి భూములు సంగతి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బుగ్గన చెబుతున్న లెక్కల ప్రకారం 50 ఎకరాలు లేనప్పుడు.. 4 వేల ఎకరాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మీరు చెప్పేది వాస్తవమే అయితే మీ వైకాపా కార్యాలయంలోనే వాస్తవ, అవాస్తవాలు తేల్చుకుందామన్నారు. మూడు రాజధానులంటే పార్టీ బ్రాంచి కార్యాలయాలు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై జ్యుడీషియల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సవాల్‌ విసిరారు. పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు దత్త పుత్రుడు ప్రచారం చేస్తున్నారని, అసలు ఆయనను అనే స్థాయి మీకుందా? అని నిలదీశారు. రాజధాని రైతులకు సంఘీభావంగా చంద్రబాబు సతీమణి గాజులిస్తే ఆమెపైనా విమర్శలు చేస్తున్నారని ఉమ మండిపడ్డారు. అప్పట్లో  25వేల ఎకరాలని.. మొన్నటికి మొన్న 600 ఎకరాలు అని.. ఇప్పుడు మళ్లీ 4వేలు ఎకరాలు అని ప్రచారం చేస్తున్నారని  అన్నారు. రైతుల ఉద్యమాన్ని దృష్టి మరల్చాడానికి తెదేపా ప్రభుత్వం బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని