‘జగన్‌ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసింది’

తాజా వార్తలు

Published : 09/01/2020 14:04 IST

‘జగన్‌ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసింది’

 రాష్ట్రంలో పరిస్థితులు శ్రీనగర్‌ను తలపిస్తున్నాయి
 తెదేపా నేత పూసపాటి అశోక్‌ గజపతిరాజు

విజయనగరం: ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు శ్రీనగర్‌ను తలపిస్తున్నాయని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ తెదేపా విజయనగరంలో సంతకాల సేకరణ చేపట్టింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో అశోక్‌ గజపతిరాజుతోపాటు జిల్లా అధ్యక్షుడు మహింతి చిన్నంనాయుడు, తెదేపా ఎమ్మెల్సీ జగదీష్‌, సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యేలు చిరంజీవులు, కె.ఎ.నాయుడు పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తు్న్న తీరు దుర్మార్గమన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రలో లేదా జగన్‌ పాదయాత్రలో అరెస్టులు జరిగాయా? అని అశోక్‌ గజపతిరాజు ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసే సంస్కృతి లేదని గుర్తు చేశారు. జగన్‌ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయటం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆపడం దుర్మార్గమన్నారు. రాజధాని భూములు తిరిగి ఇచ్చేస్తారన్న అంశం ఆశ్చర్యానికి గురిచేందని చెప్పారు. అదెలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అందరినీ రోడ్డున పడేసే ప్రయత్నాలు మంచివి కాదని అశోక్‌ హితవు పలికారు. అమరావతిని ఒకరు శ్మశానమని, మరొకరు ఎడారని, ఇంకొకరు ముంపు ప్రాంతమని అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాజధాని అంశంలో ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాజధాని అంశం ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సమస్య కాదని, రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన సమస్య అని అభిప్రాయపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని