అమరావతిని ఎందుకు మారుస్తున్నారు?

తాజా వార్తలు

Updated : 11/01/2020 22:01 IST

అమరావతిని ఎందుకు మారుస్తున్నారు?

తిరుపతి ర్యాలీలో చంద్రబాబు

తిరుపతి: అమరావతిని ఎందుకు మారుస్తున్నారో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. రాజధాని మునిగిపోతుందని వైకాపా నేతలు చెబుతున్నారని, కానీ, నాగరికత నీళ్లు ఉన్నచోటే వెలిసిందని చంద్రబాబు చెప్పారు. చరిత్ర కూడా తెలియదా? అని ప్రశ్నించారు. ర్యాలీ ముగిసిన అనంతరం బహిరంగ సభలో జై అమరావతి.. జైజై అమరావతి అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. ‘‘మన రాజధాని అమరావతి ఉండేలా ఆశీర్వదించాలని వేంకటేశ్వరస్వామిని కోరా. దేవేంద్రుడి రాజధాని అమరావతి. శాతవాహనుల కాలం నుంచి  అమరావతి కేంద్రంగా పాలన సాగింది. అమరావతిని ఎందుకు మారుస్తున్నారో చెప్పండి. విశాఖలో భూములు కొట్టేయాలని వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారు’’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

అమరావతి పరిరక్షణ ర్యాలీ చేపట్టిన ఐకాసకు సంఘీభావం తెలపకుండా చిత్తూరు జిల్లా నేతలను పోలీసులు అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. తననూ అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో పరిపాలనకు కావాల్సిన భవనాలన్నీ ఉన్నాయని చెప్పిన చంద్రబాబు.. ప్రజావేదిక కూల్చివేతతోనే వైకాపా ప్రభుత్వ విధ్వంసం ప్రారంభమైందని చెప్పారు.

‘‘నేను తిరుపతి వీధుల్లోనే తిరిగా.. చదువుకున్నా.. ప్రపంచ వ్యాప్తంగా నాగరికత వెలిసింది నదీ తీరాల్లోనే. రాజధాని అంటే వీళ్లకు అపహాస్యంగా ఉంది. రాజధాని ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలి. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారుతాయా? ఒక్క పిలుపు ఇస్తే రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. ఒక్క పైసా తీసుకోకుండా భూములు ఇచ్చారు. హైదరాబాద్‌ లాంటి రాజధాని మనకు వద్దా? విశాఖలో ఏడు నెలలుగా దొంగ లెక్కలు రాస్తున్నారు. విశాఖ రాజధాని అయితే రాయలసీమ జిల్లాలకు చాలా దూరం. కుప్పం నుంచి విశాఖ వెళ్లాలంటే 950 కి.మీల దూరం. ఎక్కడైనా ఒక రాష్ట్రానికి ఒక రాజధానే ఉంటుంది. ఈ సీఎంకు అభివృద్ధి చేతకాదు.. విధ్వంసం మాత్రమే వచ్చు. రాజధాని కావాలని విశాఖవాసులు ఎప్పుడైనా అడిగారా? రాజధానికి అభివృద్ధికి సంబంధంలేదు.  రాజధాని కాకపోయినా ఇప్పటిదాకా విశాఖ అభివృద్ధి చెందలేదా? డేటా సెంటర్‌లు, లులూ సెంటర్‌ ఎందుకు రద్దు చేశారు?  విశాఖలో మెట్రో రైలు, విమానాశ్రయం ఎందుకు ప్రారంభించలేదు? మళ్లీ విశాఖలో కొత్తగా భవనాలు కడతారా? అమరావతి రైతులకు భూములు తిరిగి ఇస్తామని అంటున్నారు. విమానాశ్రయం, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలు కొట్టి భూములిస్తారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఉద్యమిస్తున్న మహిళలను కొట్టడం, దాడి చేయడం వంటి వాటిపై పోలీసులు ఆలోచించాలని చంద్రబాబు అన్నారు ‘‘ఏపీ ప్రజలు రాజధాని కట్టుకోలేని అసమర్థులని తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారు. రాష్ట్రం నాశనం కాకుండా మనమంతా ప్రయత్నించాలి. ఈ ప్రభుత్వ పరిపాలన వల్ల 15 మంది రైతులు చనిపోయారు. రైతులు, మహిళలపై దాడులు చేస్తే ఊరుకోం. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? విశాఖ నాకెంతో ఇష్టమైన నగరం. అమరావతి కోసం ప్రజా ఉద్యమం రావాలి.  ప్రత్యేక ప్రణాళికలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేసుకోవాలి. ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. ప్రతి గ్రామం తుళ్లూరు, మందడంలా మారాలి. రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవడం నీచాతినీచం. 9 ఏళ్లలో హైదరాబాద్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా. అమరావతి రైతుల కోసం సాటి రైతులూ రోడ్డెక్కాలి. అమరావతిలో భవనాలన్నీ నిర్మించాం.. ఇక వేటికి పునాదులు వేస్తారు? ఈ ప్రభుత్వం చర్యలతో బాధ, ఆవేదన కలుగుతోంది’’ అన్నారు.

ఏపీ అంటే అమరావతి, పోలవరం

ఒక రాష్ట్రం.. ఒక రాజధాని అనేదే మన నినాదమని చంద్రబాబు అన్నారు. ‘‘ఏపీ అంటే అమరావతి, పోలవరం. ఈ రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లు. స్వర్ణముఖి, సోమశిల, హంద్రీనీవా ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేశాం. తిరుపతిని విద్యా కేంద్రంగా మార్చాం. ఈ ప్రభుత్వ ఉన్మాద పాలన చూసి అనేకమంది పారిపోతున్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా మార్చిన ఘనత మాదే. వైకాపా పాలన చూసి పెట్టుబడిదారులెవరూ రారు. తిరుపతిలో రూ.2.84లక్షల విరాళం వచ్చింది. రాష్ట్రాభివృద్ధి కోసం ఎందుకింత తపన అని కొందరు నన్నడిగారు. భావితరాలు బాగుండాలనేదే నా ఆలోచన. నేనెప్పుడూ 25 ఏళ్ల యువకుడిలా ఆలోచిస్తా.  ఒక్కసారి అవకాశం ఇచ్చి మోసపోయామని అందరూ బాధపడుతున్నారు. అమరావతిని కాపాడుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని