ఇంత ఖరీదైన ఎన్నికలు చూడలేదు:లక్ష్మణ్‌

తాజా వార్తలు

Published : 26/01/2020 01:41 IST

ఇంత ఖరీదైన ఎన్నికలు చూడలేదు:లక్ష్మణ్‌

హైదరాబాద్: తెలంగాణలో భాజపాను విస్తరించేందుకు ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడతాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి తెరాస విజయం సాధించిందని ఆరోపించారు. 2023లో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి పొత్తులు లేకుండా భాజపా ఒంటరిగా పోటీ చేసిందన్నారు. పార్టీలతో కాకుండా అధికార అక్రమార్కులతో పోటీ చేశామని లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికార తెరాస ఒక్కో వార్డుకు రూ. కోటి చొప్పున ఖర్చు చేసిందని.. మొత్తం ఎన్నికల ప్రక్రియనే మార్చేసిందని దుయ్యబట్టారు. దేశంలో ఇంత ఖరీదైన ఎన్నికలు ఎప్పుడూ.. ఎక్కడా చూడలేదని అన్నారు.

అధికార పార్టీకి ఇది హెచ్చరిక..

అనుకున్న ఫలితాలు రానప్పటికీ సానుకూల ఫలితాలను సాధించినట్లు లక్ష్మణ్‌ తెలిపారు. తెలంగాణలో భాజపా విస్తరిస్తోందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీల పనితీరుపైన ఆధారపడి ఫలితాలు ఉంటాయని లక్ష్మణ్‌ అన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో భాజపా ప్రాతినిధ్యం ఉందని.. అధికార పార్టీకి ఇది హెచ్చరిక లాంటిదని లక్ష్మణ్ అన్నారు. భాజపా తమకు అసలు పోటీయే కాదని అన్న కేటీఆర్‌.. తన సొంత నియోజకవర్గంలోనే పూర్తి స్థాయి విజయం సాధించలేకపోయారని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు. ఫలితాల మీద నమ్మకం ఉన్న తెరాస ఛైర్మన్, మేయర్ అభ్యర్థులను ముందుగా ఎందుకు ప్రకటించలేదని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. తెరాస గ్రాఫ్ పడిపోయిందని.. భాజపా గ్రాఫ్ దూసుకెళ్తుందని అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని