నా పాత్ర ఉంటే కాల్చేయండి: బీటెక్‌ రవి

తాజా వార్తలు

Published : 30/01/2020 18:07 IST

నా పాత్ర ఉంటే కాల్చేయండి: బీటెక్‌ రవి

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించేందుకు సీఎం జగన్‌ ఎందుకు వెనకడుగు వేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ప్రశ్నించారు. వివేకా కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయన కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పలువురు అనుమానితుల పేర్లను సైతం ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ జాబితాలో బీటెక్‌ రవి పేరు చేర్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. కడప తెదేపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన భార్య సౌభాగ్యమ్మ హైకోర్టులో పిటిషన్‌ వేస్తూ తనతో పాటు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు చేసిన విషయాన్ని బీటెక్‌ రవి గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్‌ కుటుంబసభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ సునీత హైకోర్టులో పిటిషన్‌ వేసినా సీఎం జగన్‌ ఎందుకు కేసును తేల్చలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీబీఐ విచారణ కోరిన జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పుడెందుకు ఆ పని చేయడం లేదన్నారు. ఈ కేసులో ఎవరిని రక్షించేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. వివేకా కేసులో అమాయకులను బలి చేయకూడదనే ఉద్దేశంతోనే తాను కూడా హైకోర్టులో సీబీఐ విచారణ కావాలని పిటిషన్‌ దాఖలు చేసినట్లు బీటెక్‌ రవి వివరించారు. తనకు ప్రాణహాని ఉందంటూ జగన్‌ సోదరి సునీత హైకోర్టులో విన్నవించుకున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వివేకా హత్య కేసులో తన ప్రమేయం ఉన్నట్లు రుజువైతే పులివెందుల పూలంగళ్ల వద్ద తుపాకీతో కాల్చేయాలని ఆయన సవాల్‌ విసిరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని