ఆప్‌తో మాకు ఏ సంబంధాల్లేవ్‌

తాజా వార్తలు

Published : 05/02/2020 14:40 IST

ఆప్‌తో మాకు ఏ సంబంధాల్లేవ్‌

దిల్లీ: దేశ రాజధానిలోని షెహన్‌బాగ్‌ ప్రాంతంలో కాల్పులు జరిపిన వ్యక్తి మీ పార్టీకి చెందిన వ్యక్తి అంటే.. మీ పార్టీకి చెందిన వ్యక్తంటూ భాజపా, ఆప్‌ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే.. కాల్పులకు పాల్పడ్డ తన కొడుకు కపిల్‌ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదంటూ అతడి తండ్రి గజే సింగ్‌ చెప్పుకొచ్చారు. షెహన్‌బాగ్‌ వద్ద కాల్పులు జరిపిన కపిల్‌ ఆప్‌ నేతలతో కలిసి ఆ పార్టీ టోపీ పెట్టుకుని ఉన్న ఫొటోను చూపిస్తూ భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలోనే అతడి తండ్రి బుధవారం స్పందించారు.

‘నాకు, నా కుటుంబానికి ఆప్‌తో ఎలాంటి సంబంధాలు లేవు. గతేడాది లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో వాళ్లు ప్రచారానికి వచ్చిన సమయంలో మేమందరం ఆప్‌ టోపీ ధరించాం. దానికి సంబంధించిన ఫొటోనే అది. 2012లో నేను బీఎస్పీలో చేరాను. ఆ పార్టీ తరఫున పోటీ చేశాను. కానీ ఆనారోగ్య కారణాల వల్ల రాజకీయాల నుంచి వైదొలిగాను. ఇప్పుడు భాజపా అభ్యర్థి ప్రచారం నిమిత్తం మా ప్రాంతానికి వచ్చినా అతడికి పూలమాల వేసి స్వాగతం పలుకుతాను. ఆయనే కాదు ఏ పార్టీ వ్యక్తి వచ్చినా నేను ఇదే విధంగా చేస్తాను’ అని కపిల్‌ తండ్రి గజే సింగ్‌ తెలిపారు.

గత వారం సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న షెహన్‌బాగ్‌ ప్రాంతంలో కపిల్‌ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే.. అతడు విచారణలో ఆప్‌ కార్యకర్తగా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆప్‌ కార్యకర్తలతో కలిసి దిగిన ఫొటో అతడి ఫోన్‌లో ఉంటే దాన్ని పోలీసులు మీడియా ఎదుట ఉంచారు.

ఆప్‌ కార్యకర్త అయితే కఠినంగా శిక్షిస్తాం..
దిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు విడుదల చేసిన ఫొటోపై సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. ‘భాజపా దిల్లీ పోలీసులను ఉపయోగించుకుంటోంది. కపిల్‌కు ఆప్‌తో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే అతడిని కఠినంగా శిక్షిస్తాం. ఇవన్నీ ఎన్నికలకు ముందు భాజపా చేస్తున్న రాజకీయ నాటకాలు’ అని కేజ్రీవాల్‌ మండిపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని