భాజపాలో ఆ అర్హత ఎవరికీ లేదు: కేజ్రీవాల్‌

తాజా వార్తలు

Updated : 06/02/2020 17:28 IST

భాజపాలో ఆ అర్హత ఎవరికీ లేదు: కేజ్రీవాల్‌

దిల్లీ: భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికీ లేదని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచిత పథకాలను కొనసాగిస్తామని, అవసరమైతే మరిన్ని తీసుకొస్తామని ప్రకటించారు. ఈ నెల 8న జరిగే ఎన్నికలకు ప్రచార గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భాజపాపై విరుచుకుపడ్డారు.

భాజపా సీఎం అభ్యర్థి ఎవరో తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని కేజ్రీవాల్‌ అన్నారు. ఒకవేళ ఏ సంబిత్‌ పాత్రానో.. ఏ అనురాగ్‌ ఠాకూర్‌నో ముఖ్యమంత్రిని చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలింగ్‌కు ముందైనా ఆ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను చీల్చాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోందని, ఎవరు విజయం సాధిస్తారో 11న తేలుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే షాహిన్‌బాగ్‌ రోడ్డును భాజపా పునరుద్ధరించాలని అనుకోవడం లేదని ఆరోపించారు. ఆ పార్టీ కేవలం షాహిన్‌బాగ్‌పైనే దృష్టి సారించిందని, ఇతర విషయాలను పక్కన పెట్టిందన్నారు. జనవరి 15 నుంచి కేవలం షాహిన్‌బాగ్‌ గురించే వారు మాట్లాడుతున్నారని, అనధికార కాలనీల గురించి ప్రస్తావించడం లేదని కేజ్రీవాల్‌ అన్నారు. అనధికార కాలనీల క్రమబద్ధీకరణ వల్ల 40 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని భాజపా నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారని, గత నాలుగు నెలల్లో రిజస్టర్‌ చేయించింది కేవలం 20 మందికేనని కేజ్రీవాల్‌ చెప్పారు. ఈ లెక్కన 40 లక్షల మందికి రిజిస్టర్‌ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారని ప్రశ్నించారు. 

తాము అధికారంలోకి వస్తే ఉచిత పథకాలు కొనసాగిస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. వాయు కాలుష్యం తగ్గించడం, రోడ్ల ఆధునికీకరణ, స్వచ్ఛ దిల్లీ, 24×7 నీటి సదుపాయం కల్పించడం తమ ముందున్న లక్ష్యాలని వివరించారు. మంచి చదువు, ఉన్నతమైన వైద్య సదుపాయాలు, మంచి రోడ్లు, 24 గంటల విద్యుత్‌ కావాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆప్‌ ఓటు బ్యాంకేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దిల్లీ ప్రజలకు మేలు చేసే మంచి పథకాలను తాము అమలు చేస్తున్నామని, తమ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య పథకం ద్వారా రెండు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ వల్ల రూ.10లోపు ఆదాయ వర్గాలకు మాత్రమే ప్రయోజనకరమని చెప్పుకొచ్చారు. దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ చేసిన అభివృద్ధిని కేజ్రీవాల్‌ తన ఖాతాలో వేసుకుంటున్నారని కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. అలాగైతే ప్రజలు ఆప్‌కు ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని