బడ్జెట్‌ ప్రతిపై గాంధీ చిత్రం.. విపక్షాల ఫైర్‌

తాజా వార్తలు

Published : 07/02/2020 16:56 IST

బడ్జెట్‌ ప్రతిపై గాంధీ చిత్రం.. విపక్షాల ఫైర్‌

తిరువనంతపురం: కేరళ బడ్జెట్‌ ప్రసంగ ప్రతిపై అక్కడి ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం గాంధీ హత్యోదంతానికి సంబంధించిన చిత్రాన్ని ముద్రించడం చర్చనీయాంశమైంది. గాంధీని ఎవరు హత్య చేశారో మరోసారి గుర్తు చేయడానికే ఈ చిత్రాన్ని ముద్రించామని ప్రభుత్వం సమర్థించుకోగా.. గాంధీని ఇలా రాజకీయాలకు వాడుకోవడం సరికాదని విపక్షాలు మండిపడ్డాయి.

కేరళ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ ఇసాక్‌ వరుసగా ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ ప్రతిపై మహాత్ముడు బుల్లెట్‌ గాయాలతో కూలబడి ఉన్న చిత్రాన్ని ముద్రించారు. మలయాళీ చిత్రకారుడు వేసిన ఈ చిత్రాన్ని ముద్రించినట్లు థామస్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గాంధీ హత్యను మేం మరోసారి గుర్తు చేయాలని అనుకుంటున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ఓ మతోన్మాది చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. దీన్ని ప్రజలెవరూ మరిచిపోకూడదన్న ఉద్దేశంతో ముద్రించాం’’ అని చెప్పుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై పార్టీలకతీతంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ప్రభుత్వ చర్యను ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితల (కాంగ్రెస్‌) తప్పుపట్టారు. తాము కూడా ఆరెస్సెస్‌-భాజపా విధానాలపై పోరాడుతున్నామని, అంతమాత్రన బడ్జెట్‌ ప్రతిపై ఇలా ముద్రించడం సరికాదన్నారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌కు చెందిన నేత, డిప్యూటీ ప్రతిపక్ష నేత ఎంకే మునీర్‌ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మహాత్ముడిని రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. ఆయన అందరి మనసుల్లో ఉన్నారని చెప్పారు. ఇలా బడ్జెట్‌ ప్రతిపై వాడుకోవడం అంటే ఓట్ల కోసం మహాత్ముడిని ఉపయోగించుకోవడమేనని అన్నారు. ఒకవేళ ఇదే ప్రభుత్వం విధానమై ఉంటే దీన్ని గవర్నర్‌ ప్రసంగ ప్రతిపై ముద్రించాలే తప్ప బడ్జెట్‌ ప్రసంగ ప్రతిపై కాదని మునీర్‌ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని