దిల్లీ ఎన్నికలు: ఆప్‌ హ్యాట్రిక్‌!

తాజా వార్తలు

Updated : 11/02/2020 17:30 IST

దిల్లీ ఎన్నికలు: ఆప్‌ హ్యాట్రిక్‌!

62 స్థానాల్లో విజయం
8 స్థానాలకు పరిమితమైన భాజపా
ఖాతా తెరవని కాంగ్రెస్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిగా రేకెత్తించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మరోసారి విజయ దుందుభి మోగించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఆప్‌-భాజపా మధ్య నువ్వా నేనా అంటూ సాగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం ఏకపక్షంగా వెలువడ్డాయి. 62 స్థానాల్లో ఆప్‌ ఘన విజయం సాధించింది. దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పిన భాజపా కేవలం 8 స్థానాలకే పరిమితం అయ్యింది. గతంలో షీలాదీక్షిత్‌ నేతృత్వంలో వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ కనీసం ఖాతా తెరవకుండా చతికిలపడింది.

దిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 8న పోలింగ్‌ జరిగింది. అదే రోజు సాయంత్రం వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఆప్‌దే విజయం అని అంచనా వేశాయి. మంగళవారం 21 కేంద్రాల్లో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు దాటి ఆప్‌ విజయం సాధించింది. కౌంటింగ్‌లో మొదటి నుంచీ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఓ దశలో భాజపా 20 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచినప్పటికీ చివరికి 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ ఏ స్థాయిలోనూ ఆధిక్యం కనబరచలేదు.

అప్పుడు 67.. ఇప్పుడు 62

2013లో జరిగిన ఎన్నికల్లో కేవలం 28 స్థానాలకే పరిమితమైన ఆమ్‌ఆద్మీ పార్టీ 2015 ఎన్నికల్లో ఓటు బ్యాంకును భారీగా పెంచుకుని 67 స్థానాల్లో గెలుపొందింది. అనంతరం జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటమి చవిచూసింది. లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీ పరిధిలోని 7 సీట్లనూ కైవసం చేసుకుని భాజపా అగ్రస్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉండగా.. ఆప్‌ ఏకంగా మూడో స్థానానికి పరిమితమైంది. సరిగ్గా 8 నెలలు తిరగకముందే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 62 స్థానాల్లో విజయం సాధించింది.

14న ప్రమాణస్వీకారం..
దిల్లీ అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియడంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ శాసనసభను రద్దు చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. గతంలో ఫిబ్రవరి 14నే ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్‌ అదే తేదీన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దిల్లీలో ఘన విజయం సాధించిన కేజ్రీవాల్‌కు దేశంలోని పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇవీ చదవండి... 

మళ్లీ ప్రేమికుల రోజునే కేజ్రీ ప్రమాణం?
దిల్లీ ఎన్నికల ఫలితాలు- LIVE BLOG

‘లోక్‌సభ’కు జై.. ‘అసెంబ్లీ’కి నైనై!!

లవ్‌యూ దిల్లీ.. ఇది భారతావని విజయం

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని