ఏపీ శాసన సభ, మండలి ప్రొరోగ్‌

తాజా వార్తలు

Updated : 13/02/2020 20:39 IST

ఏపీ శాసన సభ, మండలి ప్రొరోగ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలిని గవర్నర్‌ ప్రొరోగ్‌ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారమే నోటిఫికేషన్‌ విడుదల చేశారు. శాసనసభ, మండలిని ప్రొరోగ్‌ చేసిన నేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణకు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా..దానికి సభ ఆమోదం తెలిపింది. మరోవైపు సీఆర్డీఏ రద్దుపైనా సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. అయితే ఆ రెండు బిల్లులూ శాసన మండలిలో ఆమోదం పొందలేదు. తీవ్ర ఉత్కంఠ నడుమ ఆ బిల్లులను సెలక్ట్‌ కమిటీలకు పంపిస్తూ మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. మండలి ఛైర్మన్‌ వ్యవహరించిన తీరును తెదేపా సమర్థిస్తుండగా.. వైకాపా వ్యతిరేకిస్తోంది. ఆ రెండు బిల్లులకు సంబంధించి సెలక్ట్‌ కమిటీ సభ్యులను మండలి ఛైర్మన్‌ ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం సెలక్ట్‌ కమిటీల ఏర్పాటు కుదరదంటూ దస్త్రాన్ని మండలి కార్యదర్శి తిప్పి పంపడంపై ఛైర్మన్‌ షరీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే సెలక్ట్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని కార్యదర్శిని ఆయన ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఉభయ సభలను గవర్నర్‌ ప్రొరోగ్‌ చేయడంతో ఆ బిల్లుల స్థానంలో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తేనుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని