సీఏఏ వ్యతిరేక తీర్మానం:శాసనసభ ఆమోదం

తాజా వార్తలు

Updated : 16/03/2020 16:25 IST

సీఏఏ వ్యతిరేక తీర్మానం:శాసనసభ ఆమోదం

హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తెలంగాణ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. సీఏఏకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చించిన అనంతరం శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి  ప్రకటన చేశారు. ఈ తీర్మానంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు మాట్లాడారు. అనంతరం వ్యతిరేక తీర్మానం సభ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారు. తొలుత తీర్మానం ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఎందుకు తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నదీ వివరించారు. సీఏఏకు సంబంధించి దేశంలో చాలా పరిణామాలు సంభవించాయని చెప్పారు. దీనిపై లౌకిక వాదులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు.

విభజన రాజకీయాలు దేశానికి అవసరమా?:కేసీఆర్‌

‘పార్లమెంట్‌లో సీఏఏ బిల్లును మేం వ్యతిరేకించాం. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మన వైఖరేంటో చెప్పాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన అవగాహనతోనే మేం సీఏఏ,ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను వ్యతిరేకిస్తున్నాం. స్వయంగా అమెరికా అధ్యక్షుడు దేశ రాజధానిలో పర్యటిస్తున్న సమయంలో అల్లర్లు జరిగాయి. నాకే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం లేదు. మా నాన్నది తేవాలంటే ఎక్కడి నుంచి తేవాలి? ఈ దేశంలో కోట్లాది మంది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? దేశంలో ఓట్లతోనే ఎవరైనా అధికారంలోకి వస్తాం. ప్రతీ ఒక్కరికి ఓటర్‌ ఐడీ కార్డు ఉంటుంది. ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డు పనిచేయదని ఎలా అంటారు? సీఏఏని మేధావులు, కవులు, నిపుణులు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. సీఏఏకి వ్యతిరేకంగా కొంత మంది అవార్డులను తిరస్కరిస్తున్నారు. విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా?. ప్రతి ఒక్కరికి పౌరసత్వం ఉండాల్సిందే. చొరబాటుదారులను అనుమతించాలని ఎవరూ చెప్పరు. మెక్సికో వాసులు రాకుండా అమెరికా గొడనే కట్టింది. భారతదేశంలో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా?. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహీ, పాకిస్థాన్‌ ఏజెంట్‌అంటూ విమర్శలు చేస్తున్నారు’ అని కేసీఆర్‌ అన్నారు.

తీర్మానమే కాదు.. చట్టం చేయాలి: భట్టి

ఎన్‌పీఆర్‌ వల్ల ఉత్పన్నమవుతున్న పరిణామాలను సీఎం కేసీఆర్‌ దేశ ప్రజల దృష్టికి సభ ద్వారా తీసుకొచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సమస్య పరిష్కారం కోసం అందరం ఏకం కావాలని చెప్పారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సీఏఏ వ్యతిరేక తీర్మానంపై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడారు. తీర్మానాన్ని బలపరుస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ‘‘దేశంలో వివిధ కులాలు, మతాల ప్రజలు జీవిస్తున్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులకు కూడా జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశంలో ఉన్న అన్ని మతాల వారికీ సంబంధించిన సమస్య. చొరబాటుదారులను దేశంలోకి అనుమతించాలని ఎవరూ చెప్పరు. సీఏఏ, ఎన్‌పీఆర్‌లను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. తీర్మానం చేయడంతోనే సరిపెట్టుకోకుండా రాష్ట్రంలో అమలుచేయబోమని చట్టం తీసుకురావాలి. కేంద్రం మన తీర్మానం పరిగణనలోకి తీసుకొని ఎన్‌పీఆర్‌లో ఆ కాలమ్‌ను తొలగించాలని కోరుతున్నా. ఎన్‌పీఆర్‌ను 2010లో చేపట్టినా దాంట్లో తల్లిదండ్రుల పుట్టుకకు సంబంధించిన వివరాలను సేకరించలేదు. కానీ, ఎన్‌పీఆర్‌ 2020లో మాత్రం తల్లిదండ్రులు ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు అనే వివరాలను అడిగే కాలమ్‌ పెట్టడం ప్రమాదకర సంకేతం’ అని చెప్పారు.

అందుకే తెరాసతో కలిసి ఉన్నాం: అక్బరుద్దీన్‌

అనంతరం ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ సీఏఏ ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ‘ఈ చట్టం దేశాన్ని బలహీనపరిచే విధంగా ఎస్సీ, ఎస్టీ బలహీనవర్గాలకు వ్యతిరేకంగా ఉంది. ఈ చట్టం వల్ల ఉత్తరప్రదేశ్‌లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌ఆర్‌సీ కొత్త సమస్యను సృష్టిస్తోంది. పౌరుడు కాని వారికి పౌరసత్వం వస్తుంది. దేశ పౌరుడికి పౌరసత్వం పోతుంది. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. మతాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టే తెరాసతో కలిసి ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అందరినీ సమదృష్టితో చూస్తోంది. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ నిర్ణయం కోట్లాది మంది ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుంది’ అని అక్బరుద్దీన్‌ అన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని