కుటిల విమర్శలు మానుకోండి: ఆళ్ల నాని

తాజా వార్తలు

Published : 21/04/2020 01:13 IST

కుటిల విమర్శలు మానుకోండి: ఆళ్ల నాని

విజయవాడ: ప్రజలను భయాందోళనలకు గురి చేసే రాజకీయాలు చేయవద్దని ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. కుటిల విమర్శలు మానుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు సూచించారు. విపక్ష నేతలు కావాలనే బురద చల్లితే.. ఏమీ చేయలేమని అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ కరోనా టెస్టు కిట్లను రూ.65 తగ్గించి పర్చేజ్‌ ఆర్డర్‌ చేసుకున్నాం. ఇప్పటికే అవి జిల్లాలకు చేరుకున్నాయి. పర్చేజ్ ఆర్డర్‌లో పెట్టిన నిబంధన చూడకుండా విమర్శలు చేస్తారా? ఏ రాష్ట్రంలో కూడా ఇంత త్వరగా ర్యాపిడ్‌ కిట్లు తెచ్చుకోలేదు. కరోనా వచ్చాక మూడుసార్లు ఇంటింటి సర్వే నిర్వహించాం. సర్వేలో 32 వేల మంది అనుమానితులను గుర్తించాం. లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు కొనుగోలు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నాం. కరోనా నివారణ చర్యలపై చంద్రబాబు, తెదేపా నేతలు నిత్యం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలకు ఇంకా ఎలా అండగా ఉండాలన్నదే నిత్యం మా ఆలోచన. ప్రతిపక్ష నేతల కుటిల విమర్శలను ప్రజలు కూడా తిప్పికొట్టాలి’’ అని అన్నారు.

ఇంతటి పారదర్శక పాలన గతంలో ఎవరూ అందించలేదని మంత్రి చెప్పారు. గతంలో అంచనాలను పెంచి బిల్లులు ఎలా చెల్లించారో అందరికీ తెలుసని విమర్శించారు. కరోనా కట్టడి చర్యల్లో మే 3 వరకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కర్ణాటక ప్రభుత్వం కరోనా కిట్లను ఒక్కోటి రూ.795కు ఆర్డర్‌ ఇచ్చిందని, రూ. 795కి కొనేందుకు ఐసీఎంఆర్‌ కూడా సిద్ధమైందని చెప్పారు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.730కే కొనుగోలు చేసేందుకు యత్నించిందని తెలిపారు. ‘‘ ఐసీఎంఆర్‌ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాం. మా ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదు. కరోనా నివారణ చర్యలకు నిత్యం అడ్డు తగులుతున్నారు. అన్ని రాష్ట్రాలకంటే ముందే మేం జాగ్రత్తలు తీసుకున్నాం. ముందే మాట్లాడి.. మాస్కులు, పీపీఈలు, వెంటిలేటర్లు సమకూర్చుకున్నాం. ఇప్పుడు కరోనా టెస్టు కిట్ల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. అప్పుడూ, ఇప్పుడూ బురద చల్లడమే వారి పని. కరోనా భయంతో తెదేపా నేతలు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. మేం ఎప్పుడూ ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. వాస్తవాలు చెబుతాం’ అని నాని మీడియాతో చెప్పారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని