ఛత్తీస్‌గఢ్‌ తొలి సీఎం అజిత్‌ జోగి ఇకలేరు

తాజా వార్తలు

Published : 30/05/2020 02:50 IST

ఛత్తీస్‌గఢ్‌ తొలి సీఎం అజిత్‌ జోగి ఇకలేరు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జె) పార్టీ అధ్యక్షుడు అజిత్‌ జోగి (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన మే 9న రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సమయంలో ఆయనకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. ఆరోగ్యం అత్యంత విషమించడంతో వెంటిలేటర్లపై శ్వాస అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో అజిత్‌ జోగి మరణించినట్టు  ఆయన తనయుడు అమిత్‌ జోగి ట్విటర్‌లో వెల్లడించారు.

1946 ఏప్రిల్‌ 29న బిలాస్‌పూర్‌లో జన్మించిన అజిత్ జోగి భోపాల్‌లోని మౌలానా అజాద్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. రాజకీయాలకంటే ముందు ఐఏఎస్‌కు ఎంపికైన ఆయన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ఈ క్రమంలోనే 2000సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రిగా (2000-2003 మధ్యకాలంలో) అజిత్‌ జోగి బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2016లో కాంగ్రెస్‌తో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్ (జె)‌ పార్టీని స్థాపించారు. గతంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడిన అజిత్‌ జోగి.. చక్రాల కుర్చీ నుంచే రాజకీయాలు నడిపారు.

1986- 1998 మధ్యకాలంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. అలాగే, 1998 లోక్‌సభ ఎన్నికల్లో  రాయగఢ్‌ నియోజకవర్గం నుంచి, 2004 ఎన్నికల్లో గెలిచి మహసముండ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1998 నుంచి 2000 మధ్య కాలంలో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా, మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ ఉన్నారు. 2008లో మర్వాహి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగంపై అజిత్‌ జోగి, ఆయన కుమారుడు అమిత్‌ జోగిలపై కాంగ్రెస్‌ ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. దీంతో పార్టీకి దూరమైన ఆయన 2016 జూన్‌ 23న జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జె) పార్టీని స్థాపించారు.

 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని