ద్రవ్య బిల్లు ఆగడం ఇదే తొలిసారి: యనమల

తాజా వార్తలు

Updated : 18/06/2020 11:07 IST

ద్రవ్య బిల్లు ఆగడం ఇదే తొలిసారి: యనమల

అమరావతి: ద్రవ్య వినిమయ బిల్లు ఆగడం చరిత్రలోనే ఇది తొలిసారి అని ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బిల్లు పెట్టాలని ప్రతిపక్షం అడిగితే ప్రభుత్వం ముందుకు రాకపోవడం విచిత్రంగా ఉందన్నారు. బడ్జెట్‌ కంటే ఇతర అంశాలు ముఖ్యమైనవని చెప్పడం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. మండలిలో మంత్రులు రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మంత్రులు తిట్ల పురాణం అందుకున్నారని విమర్శించారు. తిట్లు భరించలేక ప్రతిస్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. 

నిబంధనల పరిధి దాటి ఎప్పుడూ సభలో వ్యవహరించలేదని యనమల స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రాధాన్యంగా భావించలేదని పేర్కొన్నారు. మండలికి అంతరాయం కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు. విధ్వంసమని తాను అనని మాటను అన్నట్టుగా మంత్రి చంద్రబోస్‌ చెప్పారని యనమల వివరించారు. బిల్లులు సెలెక్ట్‌ కమిటీలో ఉన్నాయని ప్రభుత్వమే కోర్టులో ఒప్పుకుందని గుర్తు చేశారు. సెలెక్ట్‌ కమిటీ పరిధిలో బిల్లులు ఉండగా మళ్లీ సభలో పెట్టడం తగదన్నారు. సభలో జరిగిన పరిణామాలన్నింటికీ ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. సబ్జెక్టుతో సంబంధంలేని మంత్రులు సభలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మనీ బిల్‌ కాబట్టి 14 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా పాస్‌ అవుతుందని యనమల తెలిపారు. లోకేశ్‌పై దాడి చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటామని నిలదీశారు. సాధారణంగా సభలో ప్రతిపక్షం గొడవ చేస్తుంది.. కానీ ఇక్కడ అధికార పక్షం గొడవ చేస్తోందని విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని