close

తాజా వార్తలు

Published : 12/04/2021 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పార్టీ నేతలపైనే దీదీలో అపనమ్మకం?

ఏడాది కిందట...బెంగాల్‌లో తృణమూల్‌కు ఎదురేలేదు....
ఆరు నెలల క్రితం
ఎంతచెప్పినా బెంగాల్‌ ప్రజలు భాజపాను నమ్మరు
ఎన్నికలకు ముందు...
బెంగాలీ ముద్దుబిడ్డను నేను...
తొలి రెండు విడతల ఎన్నికల ప్రచారంలో...
ముస్లింలు తమ ఓట్లు తృణమూల్‌కే వేయాలి.
మూడోవిడత తర్వాత....
మాకు 200 సీట్లు రాకుంటే భాజపా మా ఎమ్మెల్యేలను కొనేస్తుంది!
..ఇవన్నీ తృణమూల్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు! క్రమక్రమంగా మారుతూ వస్తున్న భాష, భావం... మమత చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. నానాటికీ మమతా బెనర్జీ అభద్రతలో పడుతున్నారా? గెల్చినా అధికారం నిలవదనే భయంలో పడ్డారా? అనేవి అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు!
దీదీ తాజా వ్యాఖ్యలు- మిగిలిన నాలుగు దశల పోలింగ్‌లో విపక్షాలకు అస్త్రాలవటమేగాకుండా... సొంత పార్టీలో కూడా అసంతృప్తికి కారణమవుతాయని భావిస్తున్నారు. ‘‘తృణమూల్‌కు 200కు పైగా స్థానాలను కట్టబెట్టండి. లేదంటే నా పార్టీలోని ద్రోహులకు లంచం ఇచ్చి తమవైపు లాక్కోవటానికి భాజపా ప్రయత్నిస్తుంది’’ అని గత వారం కూచ్‌ బిహర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మమత వ్యాఖ్యానించారు.
294 స్థానాలున్న బెంగాల్‌ అసెంబ్లీలో ఒకవేళ బొటాబొటి ఆధిక్యంతో నెగ్గితే మాత్రం ఈసారి తృణమూల్‌ ప్రభుత్వం ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోదేమోనన్న అనుమానాలకు దీదీ వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. భవిష్యత్‌ సంగతి ఎలా ఉన్నా ఇంకా నాలుగు దశలు మిగిలి ఉన్న ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

వీటి ప్రభావమెంత?

కూచ్‌ బిహర్‌లో మమత చేసిన వ్యాఖ్యలపై తృణమూల్‌ నేతలే పెదవి విరుస్తుండటం గమనార్హం. ‘‘దీదీ మాటలు మా పార్టీ నేతలు, కార్యకర్తల నైతిక స్థైర్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది’’ అని సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ‘సొంత పార్టీ నేతలపై పార్టీ అధినేతే అనుమానాలు వ్యక్తం చేయడం తృణమూల్‌కు చేటు చేస్తుంది. అంతేగాకుండా తృణమూల్‌ అభ్యర్థులపై సాధారణ ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది’ అన్నది కొంతమంది విశ్లేషకుల అంచనా! అత్యంత నమ్మకస్థులైన సువేందు అధికారి, రాజీవ్‌ బెనర్జీ వంటి నేతలు భాజపా తీర్థం పుచ్చుకున్నప్పుడే పార్టీ నేతలపై దీదీ విశ్వాసం సన్నగిల్లింది. విశ్వాసపాత్రులే వెన్నుపోటు పొడవడం వల్ల.. పార్టీలోని ఇతర నేతలపై దీదీకి అనుమానాలు పెరిగాయి.

విపక్షాలకు వజ్రాయుధం

మమతలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విపక్షాలకు వరంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌-వామపక్ష కూటమి దీదీ ప్రకటనను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని చూస్తోంది. గెలిచిన తర్వాత తృణమూల్‌ ఎమ్మెల్యేలు భాజపాలోకి వెళ్తారని, కాబట్టి వారికి ఓటేస్తే భాజపాకు ఓటేసినట్టేనని ప్రచారం చేస్తోంది. ‘‘మమత వ్యాఖ్యల వల్ల వామపక్ష-కాంగ్రెస్‌ల సారథ్యంలోని సంయుక్త మోర్చాకు ఓ అవకాశం లభించినట్లైంది. వారికి ఇది రాజకీయంగా కలిసొచ్చేదే. కానీ ఆ అవకాశాన్ని సంయుక్త మోర్చా వాడుకోవాల్సినంతగా వాడుకోవటం లేదు’’ అని రాజనీతిశాస్త్ర ఆచార్యులు విశ్వనాథ్‌ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. తాజా వ్యాఖ్యలతో మమతా బెనర్జీలో అభద్రతా భావం బయటపడుతోందని... రాజకీయ నిపుణులు డాక్టర్‌ అమల్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని