బండి సంజయ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

తాజా వార్తలు

Updated : 01/11/2020 11:50 IST

బండి సంజయ్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

దుబ్బాక: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం ఉదయం దుబ్బాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. భాజపా నేతలు ఏ నైతికతతో దుబ్బాకలో ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ఒక తెలంగాణ పౌరుడిగా తాను అడుగుతున్న 18 ప్రశ్నలకు బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని కోరుతూ బహిరంగ లేఖ రాశారు.

‘‘ తెలంగాణ రాగానే 7 మండలాలను ఆంధ్రాకు అప్పగించింది భాజపా ప్రభుత్వం కాదా? అతి తక్కువకు విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే లోయర్‌ సీలేరు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రాకు అప్పగించింది భాజపా ప్రభుత్వం కాదా? విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టకుండా మోసం చేయలేదా? యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును భాజపా ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకుంది? కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీని రద్దు చేసింది భాజపా కాదా? రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడచినా  తెలంగాణకు న్యాయమైన నీటి పంపకాలు చేయకుండా అన్యాయం చేస్తోంది భాజపా కాదా? ఆంధ్రాకు, దేశంలోని అనేక ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ఏర్పడినా ఆంధ్రా విద్యుత్‌ ఉద్యోగులు 1153 మంది ఇంకా ఇక్కడే పనిచేస్తున్నారు. దీని వల్ల ఏటా రూ.1000 కోట్ల భారం పడుతోంది. ఆంధ్రా ఉద్యోగులను పంపకుండా ఎందుకు మీన మేషాలు లెక్కపెడుతోంది. తెలంగాణలో 39.5లక్షల మందికి 2,016 రూపాయల పెన్షన్‌ ఇస్తుంటే .. కేంద్రం ఎందుకు 6లక్షల మందికి రూ.200 పెన్షన్‌ ఇస్తోంది?

 కేంద్రం దేశ వ్యాప్తంగా 100 విమానాశ్రయాలు కడుతుంటే.. అందులో తెలంగాణకు అవకాశం లేదు. వరంగల్ మామునూర్ లో నిజాం హయాంలోనే విమానాశ్రయనికి భూ సేకరణ పూర్తయింది.  దేశ వ్యాప్తంగా టెక్స్‌ టైల్‌ రంగ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ.. ప్యాకేజీలు ఇస్తున్న కేంద్రం వరంగల్ లో నిర్మిస్తున్న  దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ పార్కుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదు? ఆదిలాబాద్ లో గెలిస్తే సీసీఐని తిరిగి తెరుస్తాం అన్నారు.

.. గెలిచి రెండేళ్లు గడుస్తున్నా ఎందుకు తెరవలేదు? ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసినా.. కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? తెలంగాణకు మొత్తం రావాల్సిన రూ.12వేల కోట్లు ఇవ్వకుండా వివక్ష ప్రదర్శించడం లేదా?’’ అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. తాను రాసిన బహిరంగ లేఖపై బండి సంజయ్‌ స్పందిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని