Narada Case: ఆ నలుగురికి గృహనిర్బంధం

తాజా వార్తలు

Published : 22/05/2021 01:28 IST

Narada Case: ఆ నలుగురికి గృహనిర్బంధం

కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు..

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో రాజకీయ తుపాను రేపిన నారదా స్టింగ్‌ ఆపరేషన్‌ వ్యవహారంలో కోల్‌కతా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టయిన టీఎంసీ మంత్రులు సహా నలుగురు నేతలను ప్రస్తుతానికి గృహనిర్బంధంలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ నలుగురి బెయిల్‌ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనానికి పంపుతున్నట్లు తెలిపింది. 

నారదా కుంభకోణం వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్‌ మిత్ర, తృణమూల్‌ మాజీ నాయకుడు సోవన్‌ ఛటర్జీలను గత సోమవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగాల్‌ ముంఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణం చేసిన రెండు రోజులకే వీరిపై సీబీఐ విచారణకు గవర్నర్‌ అనుమతినివ్వడం రాజకీయ వివాదానికి తెరలేపింది. అరెస్టులను నిరసిస్తూ సీఎం మమత స్వయంగా సీబీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం సాయంత్రమే నలుగురికీ బెయిల్‌ మంజూరు చేసింది. అయితే దీనిపై సీబీఐ వెంటనే హైకోర్టును ఆశ్రయించడంతో ఉన్నత న్యాయస్థానం బెయిల్‌ను రద్దు చేస్టూ స్టే విధించింది.

దీంతో మంత్రులు, నేతలు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ జరిపింది. అయితే తీర్పుపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేతలకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని జస్టిస్‌ అర్జిత్‌ బెనర్జీ అభిప్రాయపడగా.. తాత్కాలిక సీజే అందుకు ఏకీభవించలేదు. దీంతో ప్రస్తుతానికి మంత్రులు సహా నలుగురు నేతలను ప్రస్తుతానికి గృహనిర్బంధంలో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. వీరి బెయిల్‌ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం విచారించనున్నట్లు వెల్లడించింది. 

ఏంటీ స్టింగ్‌ ఆపరేషన్‌..

నారదా న్యూస్‌ పోర్టల్‌కు చెందిన ఓ విలేకరి 2014లో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఆ సమయంలో ఈ నలుగురు నేతలు దీదీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. తానో కంపెనీ పెడుతున్నానని, దానికి లాభం చేకూర్చడానికి లంచాలు ఇస్తామని..  చెప్పగా అందుకు వీరు అంగీకరించారు. లంచం  తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వీడియో టేపులు కలకలం సృష్టించాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు 2017లో కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు మరో 9 మంది నేతలు, అధికారులపై కేసు నమోదైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని