గాంధీ-నెహ్రూ వ్యవస్థల వల్లే దేశం నిలబడుతోంది
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గాంధీ-నెహ్రూ వ్యవస్థల వల్లే దేశం నిలబడుతోంది

మోదీ ప్రభుత్వంపై శివసేన విమర్శలు

ముంబయి: భారత్‌లో కరోనా విలయాన్ని చూసి పొరుగున ఉన్న చిన్న దేశాలు సైతం భారత్‌కు ఆపన్నహస్తం అందిస్తున్నాయని శివసేన గుర్తుచేసింది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ. వేల కోట్లు విలువ చేసే సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును మాత్రం ఆపడం లేదని విమర్శించింది. దేశంలో కరోనా ఉద్ధృతిని ఉద్దేశించి పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో కేంద్ర ప్రభుత్వంపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది.

గత 70 ఏళ్లలో మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో నెలకొల్పిన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల వల్లే నేడు భారత్‌ ఈ పరిస్థితులను తట్టుకొని నిలబడగలుగుతోందని శివసేన అభిప్రాయపడింది. ‘‘భారత్‌లో విజృంభిస్తున్న కరోనా యావత్తు ప్రపంచానికి ముప్పని యూనిసెఫ్‌ భయాందోళన వ్యక్తం చేసింది. వీలైనన్ని ఎక్కువ దేశాలు భారత్‌కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్‌ 10 వేల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ను, భూటాన్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను ఇలా నేపాల్‌, మియన్మార్‌, శ్రీలంక సైతం ‘ఆత్మనిర్భర్‌ నిర్భర్‌’ భారత్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. నెహ్రూ-గాంధీ నెలకొల్పిన వ్యవస్థలపైనే భారత్‌ నిలబడుతోంది. పేద దేశాలు సైతం భారత్‌కు సాయం చేస్తున్నాయి. పాకిస్థాన్‌, రువాండా, కాంగో వంటి దేశాలు ఒకప్పుడు ఇతర దేశాల నుంచి సాయం పొందేవి. కానీ, కేవలం నేటి పాలకుల తప్పుడు విధానాల వల్లే భారత్‌ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది’’ అని సామ్నాలో మోదీ ప్రభుత్వంపై శివసేన విరుచుకుపడింది.

కేంద్ర ఆరోగ్య శాఖ బాధ్యతల్ని నితిన్ గడ్కరీకి ఇవ్వాలన్న భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్‌ను ప్రస్తావించిన సేన.. నేటి సర్కార్‌లోని ఆరోగ్య మంత్రిత్వశాఖ పూర్తిగా విఫలమైందనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించింది. ‘‘నేడు భారత్‌ నిలబడగలుతోందంటే.. పండిట్‌ నెహ్రూ, లాల్ బహదూర్‌ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, పి.వి.నర్సింహారావు, మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని నాటి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులే కారణం’’ అని శివసేన అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి నుంచి బయటకు రావాలంటే చాలా కష్టపడాలని, రాజకీయేతర జాతీయవాదంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని