close

తాజా వార్తలు

Updated : 26/02/2021 16:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాళ్లు ప్రజాసేవ చేయరు.. చేయనివ్వరు: పవన్‌

ప్రత్యర్థులను హింసించే పనిలో ఉన్నారు

భీమవరం ఎమ్మెల్యే బ్యాంకును దోచేసిన వ్యక్తి

మండిపడిన జనసేన అధినేత

అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని ఓర్వలేక చాలా మంది వైకాపా నేతలు నియోజకవర్గాల్లో దాడులకు పాల్పడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. భీమవరం నియోజకవర్గం మత్స్యపురిలో జనసేన మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందిన దళిత మహిళ కారేపల్లి శాంతిప్రియ పట్ల స్థానిక వైకాపా నేతలు అనుచితంగా వ్యవహరించారన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తే దాన్ని చించేసి సర్పంచ్‌పై దుర్భాషలాడుతూ అక్కడి నుంచి పంపిచేశారని మండిపడ్డారు. ఈ మేరకు పవన్‌ పేరిట జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

మత్స్యపురి సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఇళ్లపై దాడులకు పాల్పడటం.. ఇంటి బయట ఉన్న కార్లు, జనసైనికుల బైక్‌లను ధ్వంసం చేయడం బాధకలిగిస్తోందని పవన్‌ అన్నారు. 151 మంది వైకాపా ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయాల్సిందిపోయి వేరే పార్టీల ప్రత్యర్థులను హింసించే పనిలో ఉన్నారని ఆరోపించారు. వాళ్లు తప్ప ఎవరూ గెలవకూడదనే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ వాళ్లు చేయరు.. చేయనివ్వరని వ్యాఖ్యానించారు. పరిస్థితి అలా ఉన్నందునే మత్స్యపురి గ్రామంలో జనసేనను సంపూర్ణంగా గెలిపించారన్నారు. 14 వార్డులకు 12 వార్డుల్లో విజయాన్ని అందించారని పేర్కొన్నారు.

పీఠం కదులుతున్నప్పుడే భయమేస్తుంది

వైకాపాకు చెందిన భీమవరం ఎమ్మెల్యే అనేక రకాలుగా బెదిరించడం, దుర్భాషలాడటం.. వ్యక్తిగతంగా తనను దూషించడం ఆయనకు రివాజుగా మారిందని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పీఠం కదులుతున్నప్పుడే భయమేస్తుంది. ఆ భయం నుంచి వచ్చే మాటలే అవి. భీమవరం ఎమ్మెల్యే స్థానిక కోపరేటివ్‌ బ్యాంకును దోచేసిన వ్యక్తి. చిరు వ్యాపారులు, పాఠశాల ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని ఆ బ్యాంకులో దాచుకుంటే వాళ్ల కష్టాన్ని దోచేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి వేరేలా ప్రవర్తిస్తాడని మనం ఆశించకూడదు. దీనికి సమాధానం ఎలా చెప్పాలో మాకు బాగా తెలుసు. ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు మీ పరిధిలో ఉండండి. మా వాళ్లు ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాం. దాడులు చేసి ఇళ్ల మీదకు వస్తే మాత్రం చూస్తూ కూర్చునే వ్యక్తులం మాత్రం కాదు’’ అని పవన్‌ హెచ్చరించారు.

మున్సిపాలిటీ వ్యాన్‌ వస్తుంది.. అప్పటి వరకు ఆగండి

భీమవరంలో శాంతిభద్రతలు గతంలో కూడా అదుపు తప్పాయని.. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆగడాలను కట్టడి చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను పవన్‌ కోరారు. ‘‘ఎమ్మెల్యే దూకుడుకు కళ్లెం వేయకపోతే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. ఆ తర్వాత మమ్మల్ని ఏమీ అనొద్దు. ఈ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే సంయమనం మాకు లేదు. దళితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించమని ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు. ఆయన ఒత్తిడికి తలొగ్గవద్దు. మీరు తలొగ్గి మా వాళ్లపై అక్రమంగా అట్రాసిటీ కేసులు బనాయిస్తే నేనే స్వయంగా మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాను. అంబేడ్కర్‌ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.. దళితులను రక్షించడానికి.. శిక్షించడానికి కాదు’’ అని పేర్కొన్నారు. తనపై ఎమ్మెల్యే వాడిన భాష పట్ల జనసైనికులు ఆగ్రహాలవేశాలకు గురికావొద్దని పవన్‌ కోరారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే అంశమని చెప్పారు. ‘‘పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం దాన్ని కరవం. మున్సిపాలిటీ వ్యాన్‌ వచ్చే వరకు ఆగి అందులో పడేస్తాం. అందరికీ మాటిస్తున్నాను. మున్సిపాలిటీ వ్యాన్‌ వస్తుంది. అప్పటి వరకు సంయమనం పాటించండి’’ అని జనసైనికులకు పవన్‌ సూచించారు. ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని