22మంది ఎంపీలనిస్తే వైకాపా ఏంచేసింది?: పవన్‌

తాజా వార్తలు

Updated : 04/04/2021 10:44 IST

22మంది ఎంపీలనిస్తే వైకాపా ఏంచేసింది?: పవన్‌

తిరుపతి: వైకాపాకు 151మంది ఎమ్మెల్యేల్ని, 22మంది ఎంపీలను ఇస్తే రాష్ట్ర ప్రజలకోసం ఆ పార్టీ ఏం చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. అమాయకులపై కేసులు పెట్టి కక్షసాధిస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే తన జోలికి వస్తే చూసుకుందాం అని సవాల్‌ విసిరారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థి మాజీ ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్‌.. వైకాపా సర్కార్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దివంగత వైకాపా ఎంపీకి జనసేన తరఫున నివాళులర్పిస్తున్నట్టు చెప్పారు. రూ.కోట్లు పన్ను కట్టాను తప్ప.. కాంట్రాక్టులు కాజేయలేదన్నారు. ‘తిరుపతి నడిబొడ్డునుంచి వైకాపాను  హెచ్చరిస్తున్నా.. ఇది నవతరం .. చొక్కాపట్టుకొని  ప్రశ్నిస్తాం. ప్రతీ వైకాపా ఎమ్మెల్యే గూండాలా మాట్లాడుతున్నారు. అన్నమయ్య నడయాడిన నేల, కృష్ణదేవరాయులు ఏలిన నేల ఇది. పోరాడితే బానిస సంకెళ్లు పోతాయి. నాకు సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్‌లు లేవు. అందుకే నేను మళ్లీ సినిమాలు చేస్తున్నా’ అన్నారు.

అందుకే మేం తిరుపతి బరిలో నిలవలేదు 
గతంలో భాజపా తిరుపతి సీటు నుంచి గెలిచిందని పవన్‌ గుర్తుచేశారు. ప్రపంచమంతా చూసే తిరుమల క్షేత్రం తిరుపతిలో ఉన్నందున ఇక్కడ జాతీయ స్థాయి నాయకత్వానికి బాధ్యతలు అప్పగిస్తే తప్పులు జరగవని అభిప్రాయపడ్డారు. భాజపాతోనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆ పార్టీకి యంత్రాంగం బలంగా ఉన్నందున ఇప్పుడు తోడ్పాటునందిస్తే రాబోయే సంవత్సరాల్లో ఏపీ దశ, దిశ మనం నిర్దేశించే శక్తి ఉంటుందనే ఉద్దేశంతోనే భాజపాకు ఈ సీటు ఇచ్చామన్నారు. ఇక్కడినుంచి బరిలో ఉన్న రత్నప్రభను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

నోటు తీసుకుంటే నైతిక హక్కు కోల్పోతాం..
‘నోటు తీసుకుంటే నైతిక హక్కు కోల్పోతాం. రూ.2వేలుకు భవిష్యత్తు అమ్ముకోవద్దు. ఏ రోజైనా సరే భయపడకుండా మాట్లాడగలగాలని తపించేవాడిని. సినిమాలో చాంతాడంత డైలాగులు మాట్లాడతాం.. రియల్‌ లైఫ్‌లోకి వచ్చేసరికి మాట్లాడలేం. ధైర్యం రాదు. ఒక ఆశయానికి నిలబడి 2019 ఎన్నికల్లో ఓడిపోయాక నాకు ధైర్యం వచ్చింది. సమాజం కోసం నేను నిలబడగలను. చేయగలను. అంబేడ్కరే నాకు స్ఫూర్తి. ఆయన ఓడిపోయారు అయినా దేశం కోసం నిలబడిన మహానుభావుడు. నారాయణగురు, ఫూలే, స్వామి వివేకానంద ఇలాంటి ఎందరో జాతీయ అంతర్జాతీయ నాయకులు నన్ను ప్రభావితం చేశారు’ అని పవన్‌ తెలిపారు.

ఈ బహిరంగ సభకు ముందు తిరుపతిలోని ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడి కూడలి వరకు పవన్‌ పాదయాత్రగా వచ్చారు. అనంతరం  శంకరంబాడి విగ్రహం వద్ద నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు సునీల్‌ దేవధర్‌, సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని