ప్రసంగంలో డైలాగులు.. మిథున్‌పై ప్రశ్నల వర్షం
close

తాజా వార్తలు

Updated : 17/06/2021 02:50 IST

ప్రసంగంలో డైలాగులు.. మిథున్‌పై ప్రశ్నల వర్షం

కోల్‌కతా: ప్రముఖ నటుడు, భాజపా నాయకుడు మిథున్‌ చక్రవర్తిని కోల్‌కతా పోలీసులు విచారిస్తున్నారు. బెంగాల్‌ ఎన్నికల సమయంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, సినిమా డైలాగులతో రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తులో భాగంగా పోలీసులు నేడు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మిథున్‌ చక్రవర్తి పుణెలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా దర్యాప్తునకు హాజరయ్యారు. 

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మార్చి 7న మిథున్‌ చక్రవర్తి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ స్టార్‌ ప్రచారకర్తగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ర్యాలీలు, సభల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో మిథున్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఇటీవల కొందరు ఫిర్యాదు చేశారు. ‘‘ఒక్క తన్ను తన్నితే.. మీ శవం శ్మశానంలోనే.. నేను కాటేస్తే మీరు ఫొటోలో మాత్రమే’’ వంటి అర్థం వచ్చేలా ఉన్న సినిమా డైలాగులు చెబుతూ ప్రజలను రెచ్చగొట్టారని, ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలకు ఈ డైలాగులే కారణమని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.

దీంతో మిథున్‌ చక్రవర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులను కొట్టివేయాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఆ డైలాగులు చెప్పానే గానీ, ఉద్దేశపూర్వకంగా చేయలేదని తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు.. కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది. ఈ కేసులో ఆయనను వర్చువల్‌గా ప్రశ్నించాలని ఆదేశించిన కోర్టు.. దీనిపై విచారణను జూన్‌ 18కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసలు నేడు ఆయనను విచారించారు. 

కాగా.. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్‌లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని