koushik reddy: బాధతో రాజీనామా చేస్తున్నా!

తాజా వార్తలు

Updated : 13/07/2021 13:38 IST

koushik reddy: బాధతో రాజీనామా చేస్తున్నా!

హైదరాబాద్: చాలా బాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని హుజురాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. హుజురాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించడంతో పార్టీ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. దీంతో కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి, పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఎంతో బాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నా. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారిలో నేను మొదటివాడిని. రూ.50కోట్లు ఇచ్చి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవదన్న రేవంత్‌ వ్యాఖ్యలు బాధాకరం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ భ్రమల్లో ఉన్నారు. అమ్ముడు పోయింది నేను కాదు.. రేవంత్‌రెడ్డే. ఆయన ఈటల రాజేందర్‌కు అమ్ముడు పోయారు’ అని కౌశిక్‌ విమర్శించారు.

రేవంత్‌కు సవాల్‌..!

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సత్తా ఉంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ తెచ్చుకోవాలని అన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్‌పార్టీ ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు.

‘‘కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పీసీసీ కార్యదర్శి పదవికి నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. నాకు ఇన్నేళ్లుగా అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి గత ఎన్నికల్లో హుజురాబాద్‌ శాసనసభ స్థానానికి టికెట్‌ కూడా ఇచ్చి ప్రోత్సహించిన రాహుల్‌గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు కృతజ్ఞతలు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నా. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నా’’

-రాజీనామా లేఖలో కౌశిక్‌రెడ్డి

కౌశిక్‌రెడ్డిని బహిష్కరిస్తున్నాం: కాంగ్రెస్‌

కౌశిక్‌రెడ్డిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తున్నట్లు పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ కోదండరెడ్డి ప్రకటించారు. తెరాసతో కుమ్మక్కై, పార్టీకి ద్రోహం చేసినందున బహిష్కరణ వేటు వేసినట్లు ఆయన తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని