లోక్‌సభలో వాయిదాల పర్వం 
close

తాజా వార్తలు

Published : 03/02/2021 23:27 IST

లోక్‌సభలో వాయిదాల పర్వం 

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా విపక్ష ఎంపీలు లోక్‌సభలో గళమెత్తారు. దీంతో బుధవారం కూడా లోక్‌సభలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులకు ఎంత నచ్చచెప్పినా వినకపోడంతో వాయిదాల పర్వమే కొనసాగింది. సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన సభా కార్యకలాపాలకు విపక్షాలు అడ్డుతగలడంతో తొలుత 4.30 గంటలకు, ఆ తర్వాత 5గంటల వరకు.. ఇలా పలుమార్లు సభ వాయిదా పడింది. చివరకు రాత్రి 9గంటలకు మరోసారి కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో సభను స్పీకర్‌ గురువారానికి వాయిదా వేశారు. 

ఈ రోజు సభ ప్రారంభం కాగానే లోక్‌సభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి రైతుల ఆందోళన అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్‌, డీఎంకే తదితర ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ క్రమంలో పలువురు ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లడంతో సభ సాయంత్రం 4.30గంటల వరకు వాయిదా పడింది. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలని స్పీకర్‌ ఓం బిర్లా పదే పదే విజ్ఞప్తి చేశారు. సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. వినకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రశ్నోత్తరాల సమయం ఎంతో ముఖ్యమైందని, కార్యకలాపాలు సాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో మరోసారి 5గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే  అధిర్‌ రంజన్‌ చౌధురి వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకంగా చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

ఈ సందర్భంలోనే ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తు నినాదాలు చేయడంతో స్పీకర్‌ హెచ్చరికలు జారీచేశారు. సీట్లోకి వెళ్లి కూర్చోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శిరోమణి అకాలీదళ్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ కూడా వెల్‌లోకి వెళ్లి.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోస్టర్‌ను ప్రదర్శించారు. దాదాపు 20మందికి పైగా కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్‌, శిరోమణి అకాలీదళ్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో స్పీకర్‌ సభను 7గంటలకు వాయిదా వేశారు. అనంతరం మరోసారి సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనబడకపోవడంతో రాత్రి 9గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పెద్దగా మార్పు లేకపోవడంతో గురువారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. 

ఇదీ చదవండి..

సాగు చట్టాలు రద్దు చేయకపోతే..‘గద్దీ వాప్‌సీ’నే!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని